'రాయలసీమలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలి'
తిరుమల : ఆంధ్రప్రదేశ్ రెండవ రాజధానిని రాయలసీమలో అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం ఆయన మాజీ మంత్రులు కాసు వెంకట కృష్ణా రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డిలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర, జమ్ము అండ్ కశ్మీర్, కర్ణాటకలో ఉన్న విధంగానే ఏపీలోనూ రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో మరోసారి ప్రత్యేక ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి వాటికన్ సిటీ తరహాలో ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కోరారు. అందుకు తగ్గట్టుగా పూర్తిస్థాయిలో మద్యం, ధూమపానం వంటివి నిషేధించాలని సూచించారు. శేషాచలంలోని మైన్స్, ఎర్రచందనం ద్వారా సమకూరే ధనాన్ని రాయలసీమ అభివృద్ధికే వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మరో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి మాట్లాడుతూ... సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కల్పించేందుకు టీటీడీ కృషి చేయాలని అన్నారు. వారితోపాటు మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.