
కశ్మీర్ సమస్యకు పరిష్కారమే లేదా!?
శ్రీనగర్: కశ్మీర్‌లో భద్రతా బలగాల బుల్లెట్లకు యువకులు నేలకొర గడం చూస్తుంటే ఎవరికైనా బాధాకరమే. కానీ కశ్మీరీలు మినహా యావత్ భారత దేశంలో పెద్దగా ఎవరూ బాధ పడరు. వారిని అమర వీరులుగా కశ్మీరీలు గుర్తిస్తారు. మిగతా దేశస్థులు వారిని టైస్టులుగా భావిస్తారు. ఎదురు కాల్పుల్లో సైనికులు మరణిస్తే కశ్మీరీలు బాధ పడరు. మిగతా దేశస్థులమైన మనం బాధ పడి నివాళులర్పిస్తాం. ‘ఆజాదీ’ కోసం ప్రాణాలర్పించే యువకులు వారికి ఎప్పటికీ స్వాతంత్య్ర యోధులే. మిగతా భారతావనికి వారెప్పుడూ టైస్టులే. దీనికి కారణం ఓ దేశమంటే కొన్ని రాష్ట్రాలతో కూడిన నైసర్గిక స్వరూపమనే భావన దక్షిణాసియులైన మనలోను నరనరాన జీర్ణించుకుపోయి ఉండడమే.
దేశ నైసర్గిక సరిహద్దుల్లోని ఒక్క అంగుళం భూభాగాన్ని కోల్పోవడానికి కూడా మన మనస్తత్వం అంగీకరించదు, ఒక్క యుద్ధంలో తప్ప. దురాక్రమించుకోవడానికి మాత్రం వెనకాడం. సిక్కిం అలా సిద్ధించిందేనంటే కొందరికి కోపం రావచ్చు. కశ్మీరీలకు ఆజాది కావాలి. మనకు మన దేశంతో కశ్మీరు కలసి ఉండాలి. ఈ మనస్తత్వం మారనంతకాలం కశ్మీరు సమస్యకు పరిష్కారం లేదు. కశ్మీరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కెనడా, బ్రిటన్ తరహా రెఫరెండమ్‌లు మనకు లేవు. కశ్మీరీ అనేది కశ్మీరుల సమస్య వారి నిర్ణయానికే వదిలేయాలన్న ఉదార స్వభావం మనకు ఎలాగు లేదు.
కశ్మీర్‌ను వదిలేస్తే వారు పాకిస్తాన్‌తో కలసిపోతారని మన రాజకీయ నాయకులు హెచ్చరికలు చేస్తుంటారు. అక్కడి మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం వారు కోరుకుంటున్నది ‘ఆజాది’ తప్ప పాకిస్తాన్‌తో అంతర్భాగం కావాలన్నది కాదు. మన దేశంకన్నా ఎంతో వెనకబడిన పాకిస్తాన్‌లో అంతర్భాగం కావాలని వారు కోరుకుంటే అది వారి కర్మ అని వదిలేస్తే పోలా. మనం ప్రత్యేక బడ్జెట్ కింద ఏటా కేటాయిస్తున్న వందలాది కోట్ల రూపాయలు మనకు మిగులుతాయికదా! అందుకు ఒప్పుకోం. మన మ్యాప్‌లో మార్పు రాకూడదు.
కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గతంలో ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఫలితం లభించలేదు. ఇటీవలి కాలంలో అటల్ బిహారి వాజపేయి, మన్మోహన్ సింగ్‌లు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కాస్త చిత్తశుద్ధితోనే ప్రయత్నాలు కొనసాగాయి. శాంతి సరిహద్దుల పేరిట కశ్మీరులోకి ఇరు దేశాలకు సమాస యాక్సెస్ ఉండేలా పాకిస్తాన్‌తో మన్మోహన్ సింగ్ ఓ ప్రతిపాదన చేశారు. ఇసుంట రమ్మంటే ఇల్లంతా తనదంటుందేమో అన్న భయంతో మన్మోహన్ ముందుగా వెనకడుగు వేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా వెకన్కి తగ్గింది.
కశ్మీర్‌కు పూర్తి స్వాతంత్య్రం ఇవ్వకపోయిన పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే కశ్మీరులో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని మేథావులు, చరిత్రకారులు ఎప్పటి నుంచే చెబుతున్న అంశం. ఢిల్లీకే పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను కల్పించడం ఇష్టంలేని నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీరుకు స్వయం ప్రతిపత్తి కల్పించడం కలే అవుతుంది. కశ్మీర్‌లో 370వ అధికరణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ అందుకు మొగ్గుచూపుతుందనుకోవడం అత్యాశే అవుతోంది. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఇంతవరకు ఎత్తివేయలేని ప్రభుత్వాలు ఆటానమస్ దిశగా ఆలోచిస్తాయని సమీప భవిష్యత్తులో ఊహించలేం. కశ్మీర్ సెగ మనకు ప్రత్యక్షంగా తగలదుకనుక మన మనస్తత్వంలో మార్పు వచ్చే అవకాశం లేదు. కశ్మీరులో బంద్‌లు పాటించిన, సమ్మెలు చేసినా మన మీద ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే కశ్మీర్ గుండా మనం వెళ్లే జాతీయ రహదారిగానీ, ఓ జాతీయ రైలు మార్గంగానీ లేదు. కశ్మీర్ మొత్తాన్ని మూసేసుకుంటే అది వారికి ఇబ్బందిగానీ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాజస్థాన్‌లో గుజ్జార్లు చేసే సమ్మె సెగ మనకు తగులుతుందిగానీ కశ్మీర్ సెగ తగలదు.
అంతవరకు కశ్మీరు రగులుతూనే ఉంటుంది. కశ్మీర్ యువకులు రాళ్లు రువ్వుతూనే ఉంటారు. విధ్వంసం సృష్టిస్తూనే ఉంటారు. భద్రతా బలగాలు లాఠీచార్జీలు చేస్తూనే ఉంటాయి. తూటాలు పేలుస్తూనే ఉంటాయి. ఇరువైపులా ప్రాణాలు పోతూనే ఉంటాయి. ‘ఆజాదీ’ అనే నినాదానికి అక్కడ చావు రాదు.
-- ఓ సెక్యులరిస్ట్ కామెంట్