మ్యాచ్ ఫినిష్ చేయకపోవడం నేరమే!
కోల్‌కతా: మ్యాచ్‌ను ముగించలేకపోవడం నేరంగా భావిస్తానని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు యూసుఫ్ పఠాన్ అన్నాడు. రానున్న మ్యాచ్‌లలో కూడా లక్ష్యఛేదనను విజయవంతంగా పూర్తిచేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇటీవల ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో 39 బంతుల్లో 59 పరుగులు చేసి యూసుఫ్ కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన యూసుఫ్.. మనీష్ పాండేతో కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. దీంతో కోల్‌కతా అలవోకగా విజయతీరాలకు చేరింది.
‘కొత్త బ్యాట్స్‌మన్ కుదురుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి బాగా ఆడుతున్న బ్యాట్స్‌మన్ మ్యాచ్‌ను ఫినిష్ చేయాలి. ప్రస్తుత మ్యాచ్‌లో నేను బాగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఔటవ్వడం బాధించింది. మ్యాచ్ ఫినిష్ చేయకుండా ఔటవ్వడం నా దృష్టిలో నేరమే. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటా’ అని యూసుఫ్ అన్నాడు. కోల్‌కతా జట్టుకు విజయానికి 38 పరుగుల దూరంలో ఉన్నప్పుడు యూసుఫ్ క్రిస్ మోరిస్ బౌలింగ్ యూసుఫ్ ఔటైన సంగతి తెలిసిందే. దూకుడుగా ఆడే తన శైలిని మార్చుకోకుండానే ఎక్కువసేపు మైదానంలో ఉండేందుకు ప్రాధాన్యమిస్తున్నానని అతను చెప్పాడు.