వామ్మో.. బ్యాట్ తోనూ బాదేస్తున్నాడు!
కోల్‌కతా: ఐపీఎల్ లో ఇప్పటివరకు బంతితోనే సత్తా చాటిన కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఇప్పుడు బ్యాట్ తోనూ చెలరేగుతున్నాడు. బౌలర్ గానే కాదు బ్యాట్స్ మన్ గానూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఓపెనర్ గా బరిలోకి పరుగుల ప్రవాహం పారిస్తున్నాడు. గుజరాత్ లయన్స్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో నరైన్ మరోసారి విజృంభించాడు. 247.05 స్ట్రైక్ రేటుతో 17 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 40 ప్లస్ పరుగుల్లో ఇదే అత్యధిక స్ట్రైక్ రేటు కావడం విశేషం. ఈ నెల 5న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ సన్ రైజర్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ 229.62 స్ట్రైక్ రేటుతో 27 బంతుల్లో 62 పరుగులు సాధించాడు.
బ్యాటింగ్ చేస్తోంది స్పిన్నరా, హిట్టరా అని అనుమానం కలిగేలా సునీల్ చెలరేగుతున్నాడు. క్రిస్ లిన్ గాయం కారణంగా ఓపెనర్ గా ప్రమోషన్ పొందిన ఈ వెస్టిండీస్ ఆటగాడు జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. బిగ్‌బాష్ టోర్నిలో మెల్‌బోర్న్ రెనెగాడ్స్ జట్టు తరపున ఓపెనర్‌గా అతడికి అనుభవం ఉన్నప్పటికీ ఐపీఎల్ లో ఓపెనర్ గా రావడం ఈ సీజన్ లోనే మొదలైంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ లో నైట్ రైడర్స్ ఓపెనర్ గా తొలిసారిగా బరిలోకి దిగి సత్తా చాటాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. దీంతో నైట్ రైడర్స్ అతడిని ఓపెనర్ గా కొనసాగిస్తోంది.