కుంభకోణాలవల్లే మాట్లాడ్డం లేదు
{పత్యేక హోదాపై చంద్రబాబు తీరును విమర్శించిన వాసిరెడ్డి పద్మ
ఆయన కేంద్రాన్ని నిలదీయలేరు.. వారంటే ఆయనకు భయం..
‘ఓటుకు కోట్లు’లో ఇరుక్కున్న బాబు ఢిల్లీముందు సాగిలపడ్డారు..
తన కేసులకోసం కక్కుర్తిపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు
హైదరాబాద్: తాను చేస్తున్న కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు తనపై ఎలాంటి విచారణలు, కేసులు లేకుండా ఉండేందుకే సీఎం చంద్రబాబు ఏపీ ప్రత్యేకహోదా కోసం ఎన్డీయే ప్రభుత్వంపై గట్టిగా పోరాడలేకుండా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజ మెత్తారు. పార్టీ కేంద్రకార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదాపై చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేరని, ఆయనకు వారంటే భయమని అన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇరుక్కున్న చంద్రబాబు ఢిల్లీ ముందు సాగిలపడి తనపైకి రాకుండా చేసుకున్నారని, బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును కాపాడలేడనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఆ కేసు చార్జిషీటులో చంద్రబాబు పేరు ఉంటుందో లేదో తెలియని దశలో ఉందని ఆమె చెప్పారు.
అవసరం లేకున్నా పోలవరాన్ని నీరుగార్చేలా పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అందులో భారీగా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని పద్మ ఆరోపించారు. రాజధాని నిర్మాణం విషయంలో బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని, జపాన్, సింగపూర్ ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారినుంచి లబ్ధి పొందుతున్నారని ధ్వజమెత్తారు. వీటన్నింటిపైనా విచారణ జరిగితే చంద్రబాబు జైల్లో ఉండాల్సి వస్తుందని, అందుకనే కేంద్రంతో పోరాడాలంటే భయపడుతూ.. తన కేసులకోసం కక్కుర్తిపడి రాష్ట్రప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబుకు తన ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్రప్రజలు ఎటుపోయినా, విద్యార్థులు, నిరుద్యోగులు ఎటుపోయినా ఆయనకు పట్టదన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే తమకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మేలు జరుగుతుందని ఎదురుచూస్తున్న వారి ప్రయోజనాల్ని తాకట్టుపెట్టి ప్రత్యేకహోదాపై మాట్లాడ్డం లేదని ఆమె దుయ్యబట్టారు.
ప్రజల్ని ఎందుకుమభ్యపెడుతున్నారు?
ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశమే లేదని ఓవైపు కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా తెగేసి చెబుతూ ఉంటే.. మరోవైపు చంద్రబాబు ప్రత్యేకహోదా వస్తుందని ఇంకా ప్రజల్ని ఎందుకు మభ్యపెడుతున్నారని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. ప్రత్యేకహోదా రాదనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసని, వారి ఎంపీయే ఆ విషయం బయటకు చెప్పారని ఆమె గుర్తు చేశారు. కేంద్రమంత్రి చేసిన ప్రకటన ఏపీకి సంబంధించింది కాదంటున్న చంద్రబాబు.. తాను స్వయంగా ఢిల్లీకెళ్లి ఎన్డీయే పెద్దల్ని కలసి ఆ ప్రకటన ఏపీకి సంబంధించింది కానే కాదని ఎందుకు చెప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు టర్కీకి వెళ్లేబదులు తన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లి ఢిల్లీ నడిబొడ్డున ప్రత్యేకహోదాపై ఎన్డీయే సర్కారును నిలదీయాలని పద్మ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మౌనం వహించినా తాము మాత్రం పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు.