పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయోజనం లేదు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసినందువల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ప్రవాస భారతీయుడు, ప్రముఖ ఆర్థికవేత్త టీఎన్ శ్రీనివాసన్ అన్నారు. భారత్‌లో నల్లధనం వెలికితీయడానికి, అవినీతిపై పోరాటానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఉపయోగపడదని చెప్పారు. అమెరికాలో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
గతేడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ.. పాత 500, 1000 నోట్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే. వీటి స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను చెలామణిలోకి తెచ్చినా ఇప్పటికీ కరెన్సీ సమస్య వేధిస్తోంది. నల్లధనం వెలికితీయడంతో పాటు అవినీతిని నిర్మూలించేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు.
పెద్ద నోట్ల రద్దుపై శ్రీనివాసన్ సందేహాలు వ్యక్తం చేశారు. అవినీతిని అరికట్టాలంటే కేంద్ర ప్రభుత్వం సరైన, పకడ్బందీ ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దు అమలు తీరును పరిశీలిస్తే ప్రభుత్వం అనాలోచితంగా, సరైన ఏర్పాట్లు చేయకుండా నిర్ణయం తీసుకుందని తెలుస్తోందని విమర్శించారు.