'పెద్ద నోట్ల రద్దుపై రోజుకో మాట'
బారాన్: నల్లకుబేరుల జాబితాను పార్లమెంట్ ముందు పెట్టాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చి పేదలకు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని మోదీ గాలికి వదిలేశారని విమర్శించారు. రాజస్థాన్ లోని బారాన్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... తమ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వారి వివరాలు స్విస్ ప్రభుత్వం.. కేంద్రానికి ఇచ్చిందని, ఈ జాబితాను పార్లమెంట్ లో ఎప్పుడు ప్రవేశపెడతారని ప్రశ్నించారు.
పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తాను అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారని తెలిపారు. అయితే మోదీ అవినీతిపై తాను చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలేదని అందుకే మరోసారి అడుగుతున్నట్టు చెప్పారు. పెద్ద నోట్ల రద్దుపై మోదీ రోజుకో మాట మట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో తీవ్రవాదాన్ని అంతం చేస్తామని మొదట్లో చెప్పిన మోదీ ఇప్పుడు నగదు రహిత ఆర్థికవ్యవస్థ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ధ్వజమెత్తారు. పేటీఎం అంటే పే టు మోదీ అని నిర్వచించారు. 99 శాతం ప్రజల వద్ద నల్లధనం లేదని అన్నారు. ప్రతిరోజు ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.