ఇక అవినీతిపరులకు మరిన్ని కష్టాలు: వెంకయ్య
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కుంభకోణానికి ఇచ్చిన టీకా మందులాంటిదని, దాని ప్రభావం మెల్లగా తెలుస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అవినీతిని తగ్గించాలంటే నగదు లావాదేవీలు తగ్గించడమనేది చాఆ ముఖ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు. 50 రోజుల గడువు నేటితో ముగిస్తుండొచ్చని, కానీ, అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి మాత్రం ఈ రోజే అసలైన ప్రారంభం అని వెంకయ్య అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు.
పదేళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించినందున దేశంలో వెల్లువెత్తిన నల్లధనానికి కాంగ్రెస్ పార్టే బాధ్యత తీసుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసే ప్రసంగం దేశ ప్రజలకు పెద్ద నోట్లు రద్దు ప్రభావం నుంచి ఊరటనిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో అతి పెద్ద కృత్యాన్ని ప్రజలు నిర్వహించారని, ఆ పనితో బ్యాంకుల వెలుపల ఉన్నంతా ఒక్కసారిగా బ్యాంకుల్లోకి వచ్చి పడిందని అన్నారు. అన్నిస్థాయిల్లో పరిశీలన చేసిన తర్వాత జమ చేసిందంతా తెల్లడబ్బా నల్లడబ్బా అని తేలుస్తామని చెప్పారు.
నిజాయితీ పరులకు ఇక నుంచి ఇబ్బందులు తగ్గుతాయని, అవినీతిపరులకు మాత్రం ఇక నుంచి సమస్యలు మరింత పెరుగుతాయని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత ఒక సీ(కరప్షన్)ని కాపాడేందుకు నాలుగు సీ(కాంగ్రెస్, కమ్యునిస్టు, కమ్యునల్, క్యాస్టియెస్ట్)లు ఒక్కటయ్యాయని ఎద్దేవా చేశారు. తాము చేసే యజ్ఞానికి భంగం కలిగించేందుకు కొంతమంది రాక్షసులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.