ముంబై: శివసేన అధినేత బీజేపీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై శివసేన పదునైన వ్యాఖ్యలతో దాడికి దిగింది. బినామీ ఆస్తులకు చెక్ పెట్టే పేరుతో పేదలను నగ్నంగా నిలబెట్టొందంటూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సూచించారు. దేశంలో అరాచకశక్తులకు వ్యతిరేకంగా మోదీ పోరాటాన్ని అభినందిస్తున్నామంటూనే, శివసేన అధికార పత్రిక సామ్నా, దో్ పహర్ కా సామ్నాలో బుధవారం ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బినామీ ఆస్తులను వెలికి తీసే నెపంతో పేదలకు మిగిలిన చడ్డీ బనియన్ ను కూడా తొలగించొద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించింది. ప్రధాని నిర్ణయం హర్షించ దగినదే అయినా పెద్దనోట్ల రద్దు తర్వాతలా పేద, మధ్య తరగతి ప్రజలు కష్టాల పాలు కావడానికి వీల్లేదన్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఎన్ ఆర్ ఐ,ఇతర మాఫియాలు తమ నల్లధనాన్ని వివిధ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టారని గుర్తు చేశారు కానీ దురదృష్టవశాత్తు సాధారణ ప్రజలు మాత్రం ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో పేదలు కష్టాలు మరింత పెరిగాయే తప్ప, నల్లధనం ఒక్కపైసా కూడా పట్టుబడలేదు.. ఒక్క పారిశ్రామికవేత్తనూ శిక్షించలేదంటూ థాకరే తీవ్ర విమర్శలు చేశారు.
విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని వాగ్దానం చేసిన మోదీ ఒక్క పైసా తేలేదు. కానీ ప్రజలు పెద్దనోట్ల రద్దు తీవ్రతను భరించారు..ఇప్పటికీ బాధలు కొనసాగుతున్నాయని థాకరే వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ తరువాత పాకిస్థాన్ టెర్రర్ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయనీ, దీంతో ఇప్పటివరకు 50 పైగా భారతీయ సైనికుల మరణానికి దారితీసిందన్నారు. అలాగే కశ్మీరీ పండిట్లకు చట్టబద్దంగా రావాల్సిన ఆస్తులు వారికి దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం సర్జికల్ దాడులు ప్రభుత్వం చేస్తుందా అని థాకరే ప్రశ్నించారు. కాశ్మీరీ పండితుల చట్టబద్ధ-యాజమాన్య ఆస్తుల హక్కులు తారుమారు కావని తాము ఆశిస్తున్నామన్నారు.