పన్నీర్‌కు ఇవ్వబోయే పదవి ఇదే!
- రేపే సీఎంగా శశికళ ప్రమాణం
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ మంగళవారం తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. మద్రాస్ వర్సిటీ సెంటినరీ హాల్‌లో ఆమె ఉదయం 8.45 గంటలకు ప్రమాణం స్వీకరించనున్నారు. దీంతో తమిళనాడుకు మూడో మహిళా ముఖ్యమంత్రిగా శశికళ నిలువనున్నారు. శశికళ కోసం మరోసారి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన పన్నీర్ సెల్వానికి సముచిత పదవిని ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆయనను ఉప ముఖ్యమంత్రిగా నియమించనున్నారని, శశికళ కేబినెట్‌లో పన్నీర్ సెల్వానికి కీలక ఫోర్టుపోలియో దక్కే అవకాశముందని వినిపిస్తోంది.
ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీంకోర్టు తీర్పు గండం వెంటాడుతున్న సంగతి తెలిసిందే. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళా నటరాజన్ కూడా సహ నిందితురాలు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో తీర్పు మరో వారం రోజుల్లో వెలువడబోతోంది. ప్రత్యేక కోర్టు ఈ కేసులో జయలలిత, శశికళలను దోషులుగా నిర్ధారించగా, కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టేసి.. ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులోనే మరోవారంలో తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.