
ముస్లింలను అమెరికా అణచివేయదు!
బరాక్ ఒబామా స్పష్టీకరణ
వాషింగ్టన్: ముస్లింలను అమెరికా ఎన్నటికీ అణచివేయబోదని ఆ దేశాధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు. ముస్లింలను అమెరికా అణచివేయబోదనే నమ్మకం కలిగించడమే ఉగ్రవాదంపై పోరుకు అత్యుత్తమ మార్గమన్నారు. బాల్టిమర్‌లోని ఒక మసీదును బుధవారం సందర్శించి, ముస్లింలనుద్దేశించి ప్రసంగించారు. యూఎస్‌లో ఒక మసీదును ఒబామా సందర్శించడం ఇదే ప్రథమం. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా పలువురు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు క్షమార్హం కానివన్నారు.
‘ఏ మత విశ్వాసంపై దాడినైనా చూస్తూ ఉండకూడదు. వ్యతిరేకించాలి. మన దేశంలో మతస్వేచ్ఛ ఉందన్న విషయాన్ని గుర్తించాలి. గౌరవించాలి’ అన్నారు.
ఇస్లాంను విమర్శించని వారి వైపే అమెరికన్ల మొగ్గు: ఉగ్రవాదాన్ని, ఇస్లాంను ఒకే గాటన కట్టి విమర్శించని వారికే అధ్యక్ష ఎన్నికల్లో తాము ఓటు వేస్తామని మెజార్టీ అమెరికన్లు తేల్చి చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న వారిలో కొందరు ఇస్లాం మతం మొత్తాన్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించి మాట్లాడడం సబబుగా లేదనీ, ఇస్లామిక్ మతం వేరు అందులోని కొందరి ఉగ్రవాద ధోరణులు వేరని 70 శాతంమంది అమెరికన్లు అభిప్రాయపడుతున్నట్లు ఓ ప్రీపోల్ సర్వే తేల్చి చెప్పింది.
మరోవైపు, అయోవాలో జరిగిన ప్రాథమికంలో ఓడిపోయిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు.. హాంప్‌షైర్‌లో భారత అమెరికన్లు అండగా నిలిచారు. కొత్తగా ఏర్పడ్డ ‘ఇండియన్ అమెరికన్స్ ఫర్ ట్రంప్-2016’ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో జరిగిన సమావేశంలో ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు.