'ఆ శకలాలు ఎయిర్ ఏషియావి కాదు'
జకార్తా: ఆకాశవీధిలో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ ఇంకా తెలియలేదు. విమానం శకలాలు సముద్రంలో కనిపించినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసుఫ్ కల్లా తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన సహాయక విమానం సముద్రంలో కనుగొన్నట్టు చెబుతున్న శకలాలు ఎయిర్ ఏషియా విమానానికి చెందినవి కాదని ఆయన స్పష్టం చేశారు. 15 నౌకలు, 30 ఎయిర్ క్రాఫ్ట్ లు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు.
(ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ లభ్యం)
ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో గాలింపు చర్యలు కష్టంగా మారాయని చెప్పారు. బెలిటంగ్ ద్వీపంలో జావా సముద్రంలో చమురు తెట్టు తేలిన ప్రదేశంలో గాలింపు జరుపుతున్నట్టు ఇండోనేసియా ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి హాది జాహ్ జాంటో వెల్లడించారు. కాగా, సహాయక చర్యల్లో ఇండోనేసియాకు సహకరించేందుకు ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా విమానాలు, నౌకలు పంపించాయి.