ఎయిర్‌ఆసియా విమానం జాడ కనిపెట్టేందుకు జావా సముద్రంపై గాలిస్తున్న సింగపూర్ వైమానిక దళ సభ్యుడు
- ఇండోనేసియా ఉన్నతాధికారి అనుమానం
- కొనసాగుతున్న గాలింపు; ప్రయాణికుల ప్రాణాలపై సన్నగిల్లిన ఆశలు
జకార్తా/సింగపూర్: ఆదివారం అదృశ్యమైన విమానం సముద్రంలో కూలిపోయి ఉండొచ్చని, అది సముద్ర గర్భంలోకి చేరి ఉండొచ్చని ఇండోనేసియా ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇండోనేసియా నుంచి ఏడుగురు సిబ్బంది సహా 162 మందితో సింగపూర్ వెళ్తున్న ఎయిర్‌ఆసియా ఎయిర్‌బస్ సుమత్ర సముద్ర జలాలపై గగనతలంలో ఉండగా ఏటీసీ పరిధి నుంచి అదృశ్యమవడం తెలిసిందే. విమానం గల్లంతై రెండు రోజులవడంతో అందులోని వారంతా మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు.
సోమవారం ఉదయం నుంచి ఇండోనేసియా, సింగపూర్, మలేసియా నౌకలు, విమానాలు గాలింపును ఉధృతం చేశాయి. ఇండోనేసియాలోని బాంగ్క ద్వీపానికి 270 నాటికన్ మైళ్ల దూరంలో గాలింపును కేంద్రీకృతం చేశారు. ‘విమానం అదృశ్యమైన ప్రాంతం, సముద్రంలో కూలిపోయి ఉండొచ్చని భావిస్తున్న ప్రాంతాలను అంచనావేసి ఆ విమానం సముద్రంలోని అట్టడుగు ప్రాంతానికి చేరి ఉండొచ్చని భావిస్తున్నాం’ అని ఇండోనేసియా గాలింపు, సహాయ సంస్థ అధినేత బాంబంగ్ సోలిస్టొ పేర్కొన్నారు.
అది ప్రాథమిక అంచనా మాత్రమేనని, అయితే, అదే నిజమైతే ఆ విమానాన్ని సముద్ర ఉపరితలంపైకి తేవడం పెద్ద సవాలని అన్నారు. విమానం ప్రమాదంలో పడగానే దానినుంచి ప్రమాద హెచ్చరికల సంకేతాలు వెలువడుతాయని, కానీ ఈ విమానం నుంచి అలాంటివేమీ రాలేదన్నారు. గాలింపు చర్యల్లో పాల్గొంటున్న ఇండోనేసియా చాపర్ సిబ్బందికి జావా జలాలపై రెండుచోట్ల చమురు తెట్లు కనిపించాయి.
నాంగ్క ద్వీప వద్ద అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. అవి గల్లంతైన విమానానికి చెందినవి కావని ఇండోనేసియా స్పష్టం చేసింది. ఏటీసీతో సంబంధాలు తెగిపోవడానికి ముందు విమాన ప్రయాణమార్గాన్ని 32 వేల అడుగుల ఎత్తు నుంచి 38 వేల అడుగుల ఎత్తుకు పెంచుకునేందుకు పైలట్ అనుమతి కోరాడని, అయితే, ఆ మార్గంలో 34వేల అడుగుల ఎత్తులో మరో విమానం వెళ్తున్నందున వెంటనే అనుమతినివ్వలేదని ఇండోనేసియా తెలిపింది.
ముంబై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కఠ్మాండు: ముంబై నుంచి 125 మందితో బయలుదేరిన జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్ క్రాఫ్ట్‌కు పక్షి ఢీకొనడంతో ఇంజిన్‌లో మంటలు చెలరేగి అత్యవసరంగా కఠ్మాండులోని త్రిభువన్ ఎయిర్‌పోర్టులో దిగిపోయింది. మంటలు వెంటనే అదుపులోకి వచ్చాయని, అందరూ సురక్షితంగా బయటపడ్డారని జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. ఇంజనీరింగ్ బృందం విమానాన్ని తనిఖీ చేసి దాని కండిషన్ బాగుందని ధ్రువీకరిస్తే తిరిగి దాన్ని వెనక్కి పంపుతామని కఠ్మాండు ఎయిర్‌పోర్ట్ పేర్కొంది. మరోవైపు లండన్ నుంచి లాస్ వెగాస్‌కు 462 మందితో వెళ్తున్న వర్జిన్ అట్లాంటిక్ బోయింగ్ విమానం మార్గ మధ్యంలో సాంకేతికసమస్య తలెత్తడంతో బ్రిటన్‌లోని గాట్విక్‌లో అత్యవసరంగా ల్యాండయ్యింది.