'విభజనను సీఎం అడ్డుకోలేరు'
ఇప్పటికే ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుకోలేరని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌దీక్షిత్ వ్యాఖ్యానించారు. పై-లీన్ తుఫానును అడ్డుకోలేకపోయినా, విభజన తుపానును మాత్రం కచ్చితంగా అడ్డుకుంటానన్న కిరణ్ ప్రకటనను ప్రస్తావించగా ఆయన పై విధంగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వద్ద ప్రస్తావించినపుడు ఆయన నవ్వేశారు. పార్టీ అధిష్టానం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా బద్ధులమై ఉంటామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా అంగీకరించిన తర్వాతే విభజనకు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని.. ఈ నిర్ణయంపై పార్టీ వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని దిగ్విజయ్ తేల్చిచెప్పారు. సోమవారం సందీప్‌దీక్షిత్ ఏఐసీసీ కార్యాలయంలో, దిగ్విజయ్‌సింగ్ తన నివాసంలో వేర్వేరుగా విలేకరులతో మట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ ఆపలేరని సందీప్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.. విభజన విధివిధానాలను కేంద్ర మంత్రుల బృందం పరిశీలిస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభిజంచి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అంశం పూర్తిగా పార్లమెంటు అధికార పరిధిలో ఉంటుంది.. దానిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అడ్డుకోగలుగుతారు?’’ అని ఆయన ప్రశ్నించారు.
రాజీనామాలతో పరిష్కారం కాదు: దిగ్విజయ్
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని దిగ్విజయ్‌సింగ్ సూచించారు. ‘‘రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే ముందు అధిష్టానంపై తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీమాంధ్ర నేతలు చెప్పారు. ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయంపై పార్టీ వెనక్కి వెళ్లదు. అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందే’’ అని ఆయన స్పష్టంచేశారు. రాజీనామాలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. ఏవైనా ప్రతిపాదనలు ఉంటే కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి ఇవ్వాలని సూచించారు. ‘‘సీమాంధ్ర నేతల ఇబ్బందికర పరిస్థితి మాకు తెలుసు. ఒకసారి నిర్ణయం చేశాక పరిష్కారాలను చూపాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఉంది. అంతా కలిసి పనిచేస్తేనే సీమాంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ ప్రజలకు సరైన పరిష్కారం లభిస్తుంది’’ అని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు.
‘అసెంబ్లీ తీర్మానం’పై షిండేని అడిగి చెప్తా...
‘అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వెళుతుందా? లేక బిల్లు వెళుతుందా?’ స్పష్టత ఇవ్వాలని విలేకరులు కోరగా.. ‘‘ఈ విషయం ఇంకా తేలాల్సి ఉంది. రాష్ట్ర విభజన బిల్లుకు ముందే తెలంగాణ తీర్మానం రాష్ట్రపతి ద్వారా శాసనసభ పరిశీలనకు వెళ్తుందని కేంద్ర హోంశాఖ తొలుత నాకు తెలియజేసింది. కానీ తర్వాత కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మరో రకంగా ప్రకటన చేశారు. మంత్రుల బృందం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. హోంమంత్రి షిండేను కలిసి, తెలంగాణ ప్రక్రియ అమలు విధానంలో ఏమైనా మార్పులు జరిగాయేమో తెలుసుకున్నాక దానిపై స్పష్టత ఇస్తా’’ అని దిగ్విజయ్ బదులిచ్చారు. విభజన అనివార్యమని తేలినందున సీమాంధ్ర అభివృద్ధికి మంచి ప్యాకేజీ ప్రకటించాలని, ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి చేసిన సూచనను మంచి ప్రతిపాదనగా దిగ్విజయ్ అభివర్ణించారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రుల బృందాన్ని కోరారు.