బాకీ తీర్చేందుకు బంపర్ ఆఫర్!
వందేళ్లు మద్యం సరఫరా!
ఈ వార్త తెలిశాక చెక్ రిపబ్లిక్ దేశంలోని మందుబాబులు పండుగ చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఆ దేశ మందుబాబులను మస్త్ ఖుషీ చేసే కబురు క్యూబా చెప్పింది. చెక్ రిపబ్లిక్‌కు క్యూబా దాదాపు రూ. 187 కోట్లు అప్పు పడింది. ఆ బాకీ తీర్చడానికి క్యూబా ఇటీవల ఓ వినూత్నమైన ఆఫర్‌ను చేసింది. దేశీయ రమ్ముకు క్యూబా పెట్టింది పేరు. కాబట్టి అప్పు కింద వందేళ్లు మీ దేశ పౌరులందరికీ సరిపడే రమ్మును సరఫరా చేస్తామని ప్రతిపాదించింది.
చెక్ రిపబ్లిక్‌కు ఇవ్వాల్సిన 276 మిలియన్ డాలర్ల అప్పును తీర్చేందుకు తమ దగ్గర ప్రస్తుతం డబ్బులేదని, కానీ, రమ్ము కావాల్సినంత అందుబాటులో ఉందని క్యూబా రాజధాని హవానాలో ఇటీవల ఆ దేశ ఆర్థికశాఖ ప్రకటించిందని బీబీసీ తెలిపింది. చెక్ రిపబ్లిక్ ఆర్థిక శాఖ కూడా క్యూబా ప్రతిపాదనను ధ్రువీకరించింది. అయితే, మొత్తం రమ్ము రూపంలో కాకుండా కొంతైనా నగదు రూపంలో చెల్లించాలని తాము కోరుతున్నట్టు ఆ దేశం తెలిపింది.
ప్రచ్ఛన్నయుద్ధం కాలం నాటి అప్పు ఇది. అప్పట్లో మధ్య, తూర్పు యూర్‌లో విస్తరించిన కమ్యూనిస్ట్ కూడలి చెకోస్లోవోకియాలో క్యూబా కూడా భాగంగా ఉండేది. ఆ తర్వాత క్యూబా వేరుపడగా.. చెకోస్లోవోకియా కాస్తా చెక్‌రిపబ్లిక్‌గా అవతరించింది. ఈ అప్పు తీర్చడానికి అవసరమైతే తమ దేశంలో తయారయ్యే ఔషధాలు కూడా సరఫరాచేస్తామని కూడా క్యూబా ప్రతిపాదించినప్పటికీ, యూరప్ ప్రమాణాలకు తగ్గట్టుగా అవి ఉండవని చెక్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.