
సంచలనం సృష్టిస్తున్న హిజ్బుల్ వీడియో
శ్రీనగర్: ఉగ్రవాదులు ఆయుధాలు చేతపట్టిన హిజ్బుల్ మొజాహిద్దీన్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. భద్రతా దళాల చేతిలో జులైలో హతమైన యువనాయకుడు బుర్హాన్ వానీ గురించి ప్రచారం చేపట్టేందుకే హిజ్బుల్ ఈ వీడియోని పోస్టు చేసినట్లు పేర్కొంది. కాగా, వీడియోలో టెర్రరిస్టులు చేతుల్లో ఆయుధాలు పట్టుకుని నవ్వుతూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు.
దాదాపు నాలుగున్నర నిమిషాల నిడివి కలిగిన వీడియోలో మొత్తం 12 మంది ఉగ్రవాదులు కనిపించారు. వానీ పద్దతిలోనే తిరిగి కశ్మీరీ యువతను ఆకర్షించేందుకు హిజ్బుల్ ప్రయత్నిస్తోందని అనడానికి ఇది చాలా చక్కని ఉదాహరణ. సోషల్ మీడియాలో ఆయుధాలతో ఫోటోలు, వీడియోలను పోస్టు చేయడం ద్వారా వానీ యువతను మిలిటెంట్ గ్రూపులోకి ఆకర్షించేవాడు.
హిజ్బుల్ విడుదల చేసిన మరో వీడియోలో గ్రూపు కొత్త నాయకుడు జకీర్ రషీద్ భట్ యువత గ్రూపులో చేరి భద్రతా దళాల నుంచి ఆయుధాలు చోరీ చేయాలని పిలుపునిచ్చాడు. గత కొద్ద నెలలుగా భద్రతా దళాల నుంచి ఆయుధాలు దొంగిలించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పటివరకూ 67 రైఫిళ్లను చోరీ చేసినట్లు సమాచారం.