దేవుళ్ల పేర్లతో అర్చకుడి నిర్వాకం..!
జైపూర్: కత్రినా కైఫ్ పేరు కేరళ జనాభా లెక్కల్లో కనిపించడం, హాలీవుడ్ సినిమా హీరోలకు హైదరాబాద్‌లో ఓటు హక్కు లభించడం లాంటి వింతలు ఇంతకుముందు ఎన్నో చూశాం. ఇక రేషన్ కార్డుల విషయంలో.. కొందరు కోటీశ్వరులకు తెల్లకార్డులు, కూటికిలేనని వాళ్ళకు గులాబి కార్డులు అందడం గమనించాం. కానీ ఏకంగా తాను పనిచేసే ఆలయంలోని దేవుళ్ల పేరు మీదే రేషన్‌కార్డులు పొంది, ఏళ్లుగా సరుకులు బొక్కేస్తున్న అర్చకుడి గురించి విన్నారా?
రాజస్థాన్‌లోని బరాన్ జిల్లా కేంద్రానికి చెందిన బాబూలాల్ అనే వ్యక్తి కజిఖేర్ ప్రాంతంలోని కృష్ణభగవానుడి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ఏమంత అవసరం అనుకున్నాడోగానీ కృష్ణుడు, ఆయన భార్య మారుపేర్లతో(మురళీ మనోహర్, ఠాకురాయన్‌జీ) రేషన్ కార్డు సంపాదించాడు. శివపుత్రుడు గణేశ్ పేరుమీద కూడా ఇంకో కార్డు తయారుచేయించాడు. అలా 2005 నుంచి దేవుళ్ల పేరుమీద నెలనెలా సబ్సిడీ ధరకు సరుకులు తెచ్చుకునేవాడు. అయితే తెలంగాణ, ఏపీల పౌరసరఫరాల శాఖలు చేపట్టినమాదిరే మాదిరే రాజస్థాన్‌లోనూ ఇటీవలే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విషయం తెలియని బాబూలాల్ గత వారం యధావిధిగా రేషన్‌షాప్‌కు వెళ్లాడు..
కార్డులను పరిశీలించిన అధికారులు.. ‘ఆ పేరుగల వ్యక్తులను మా ముందు ప్రవేశపెట్టండి’ అని ఆదేశించడంతో పూజారి బాబూలాల్ బెంబేలెత్తిపోయాడు. చివరికి అసలు విషయం కక్కేశాడు.. ఆ పేర్లన్నీ దేవుళ్లవేనని ఒప్పుకున్నాడు. దీంతో అతనికి సమన్లు జారీచేసిన పీడీఎస్ అదికారులు.. 2005 నుంచి ఇప్పటివరకు బాబూలాల్‌కు ఎంత సరుకు అందింది? అనే వివరాలను లెక్కకడుతున్నారు. బాబులాల్‌పై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ఇప్పుడే చెప్పలేమని, బయోమెట్రిక్ విధానంతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్టపడుతుందని రాజస్థాన్ పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.