రుతవి మెహతా... డేంజరస్ రేస్..!
సాహస క్రీడల్లో పాల్గొవాలంటే ఓ దమ్ముండాలి... దానికితోడు ధైర్యం కూడ కావాలి. అంతేకాదు తగిన ప్రోత్సాహం లేకపోయినా వెనక్కు తగ్గాల్సిందే... అదీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పోటీగా గుర్తింపుపొందిన రిక్షా రన్ కు పోటీ పడ్డంలో సహజంగా ఇతర దేశాలవారే ముందుంటుంటారు. అటువంటిది ఇండియానుంచీ ఏకైక మహిళ పాల్గోవడమేకాదు... ముంబైకి చెందిన రుతవి మెహతా... ఏకంగా ఏభై దేశాలు పాల్గొన్న పోటీలో గెలిచి సత్తా చాటింది.
పదిహేడు నగరాలు.. మూడువేల కిలోమీటర్లు.. గతుకుల రోడ్లలో ప్రయాణం.. కేవలం రెండువారాల్లో లక్ష్యాన్ని సాధించాలి. తీవ్రమైన పట్టుదల, సాహసం చేసే ధైర్యం, క్రీడా ప్రేమికులు అయిఉంటే తప్పించి సాధ్యం కాదు. అయితే 29 ఏళ్ళ రుతవి మెహతా ఈ పోటీని ఛాలెంజింగ్ గా తీసుకుంది. తన వృత్తిజీవితంలో ఒక్కసారి వెనక్కు వెళ్ళి ఆలోచించింది. తాను ట్రావెల్ కన్సల్టెంట్ గా ఉన్న రోజుల్లో తరచుగా తమ హోటల్ వద్దకు వచ్చే ఆటోలద్వారా ఆటో రన్ గురించి తెలుసుకోవడం జ్ఞప్తికి తెచ్చుకొంది. అప్పట్లో తాను కన్న కలను నిజం చేసుకునేందుకు రేసులో పాల్గొని కేవలం పన్నెండు రోజుల్లోనే లక్ష్యాన్నిసాధించింది. రుతవి టీమ్ రేస్ కొనసాగుతుండగా రెండుసార్లు యాక్పిండెంట్లు కూడ జరిగాయి. చివరి లక్ష్యాన్ని సాధించేందుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం సంభవించింది. కానీ గాయాలను సైతం లెక్క చేయకుండా రుతవి లక్ష్యాన్ని చేరింది.
కనీసం ఆటో ఎలా నడపాలో తెలియదు. అటువంటిది స్నేహితుల ప్రోత్సాహం, ఏదో సాధించాలన్న తపన రుతవిని రేస్ లో పాల్గొనేలా చేసింది. అద్దెకు రిక్షా తెచ్చుకొని ఎలా నడపాలో నేర్చుకొంది. రన్ లోని ఒక్కో టీమ్ లో మొత్తం ముగ్గురు సభ్యులుంటారు. రుతవి టీమ్ లో తన స్నేహితులైన అమెరికాకు చెందిన ట్రావెల్ బ్లాగర్స్ లోని డెరేక్ ఫ్రెల్, ర్యాన్ బ్రౌన్ లు పాల్గొన్నారు. తమ టీమ్ కు తీన్ రొమాంచక్ యార్ అన్న పేరు పెట్టుకొని రన్ లో పాల్తొన్నారు. ఒక్కోటీమ్.. రోజుకు మూడు వందల కిలోమీటర్లు కవర్ చేయాలి. టీమ్ లోని ఒక్కొక్కరు వంద కిలోమీటర్ల చొప్పున డ్రైవ్ చేయాలి. అయితే ఆటోరిక్షాను మూడువందల కిలోమీటర్లు డ్రైవ్ చేయడం అంటే కారులో ఆరువందల కిలోమీటర్లు వెళ్ళినట్లు లెక్క ఎందుకంటే 55 కిలోమీటర్లకు మించి స్పీడ్ వెళ్ళే అవకాశం ఉండదంటుంది రుతవి.
'ది ఎడ్వంచరిస్ట్స్' పేరున 2006 లో మొదట లండన్ కు చెందిన సంస్థ.. రిక్షా రన్ ను నిర్వహించింది. అప్పట్లో ఒక్కరు కూడ లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఈ కాంపిటేషన్ లో సాధారణ వ్యక్తులు పాల్గొనడం కూడ కష్టమే. ఎందుకంటే ఇందులో చేరాలంటే ఒక్క లక్ష్యమే సరిపోదు. ఆర్థిక పరిపుష్టి కూడ కలిగి ఉండాలి. 1550 డాలర్లు అంటే సుమారుగా లక్షా రెండువేల రూపాయలు ఆర్గనైజైషన్ కు విరాళంగా చెల్లించాలి. వివిధ రకాలుగా వాతావరణాన్ని కాపాడేందుకు సంస్థ ఆ డబ్బును వినియోగిస్తుంది. అంతేకాదు.. రిజిస్టేషన్ ఫీజు కూడ రెండువేల ఐదువందల యూరోలు. అంటే సుమారు లక్షా ఎనభై ఐదువేల రూపాయలు. ఈ ఫీజును కూడ సంస్థ పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంది.
ఇండియాలో నిర్వహించిన ఆటోరిక్షా రేస్ లో మొత్తం ఏభై దేశాలనుంచి 250 మంది పాల్గొన్నారు. రాజస్థాన్ లోని జైసల్మర్ నుంచి మేఘాలయాలోని షిల్లాంగ్ వరకూ ఏడు రాష్ట్రాలు, పదిహేడు నగరాల్లో మూడువేల కిలోమీటర్లు ఆటోరిక్షా పోటీ. ఎటువంటి సపోర్టు, హెల్ప్ లేకుండా... అనేక వాహనాలు ప్రయాణించే సాధారణ రోడ్లపైనే నిర్వహించే డేంజరస్ రేస్ అది. రుతవికి టూరిజం పట్ల ఉన్న అవగాహన తన రేస్ కు ఉపయోగించింది. ఒకప్పుడు రుతవి మెహతా తన వృత్తి పరంగా యూరోప్ మొత్తం తిరిగింది. తన ట్రావెల్ అనుభవంతో ప్రస్తుతం స్వయంగా ఫొటోకథ పేరుతో ఓ సంస్థను నడుపుతోంది.
దేశాలను చుట్టే టూరిస్టుల అనుభవాలను అందులో ఉంచుతుంది. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లోని టూరిజం బోర్డులకు కన్సల్టెంట్ గానూ వ్యవహరిస్తుంది. ఈ మధ్యకాలంలో కేరళ బ్లాగ్ ఎక్స్ ప్రెస్ పేరున నిర్వహించిన క్యాంపెయిన్ లో కేరళలోని వివిధ సంస్కృతులను సందర్శించిన 27మంది ఇంటర్నేషనల్ బ్లాగర్స్ అనుభవాలను డిజైన్ చేసే అరుదైన అవకాశం కూడ రుతవికి వచ్చింది. అటు వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ తనదైన మార్కును కనబరుస్తున్న రుతవి...మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదు అన్నదానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇండియాలో మహిళా సాధికారతను చాటిన మహిళగా రుతవి మెహతా ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకమైంది.