దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాడు రాజస్థాన్‌కు చెందిన ఓ 26 ఏళ్ల కుర్రాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ యువకుడు.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చక్కని వాగ్ధాటి, అగర్గళమైన, చురుకైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాలే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను చుట్టేస్తున్నాడు.
బార్మర్- పశ్చిమ రాజస్థాన్, ముఖ్యంగా బార్మర్-జైసల్మేర్-బలోత్రా నియోజకవర్గం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో కేంద్ర బిందువుగా మారింది. ఇది దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 1.9 మిలియన్ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 7 లక్షల మంది జాట్‌లు, 2.5 లక్షల రాజ్‌పుత్ ఓటర్లు కీలకంగా ఉన్నారు.
ఇక్కడ ఎన్నికల రణరంగం ముక్కోణపు పోటీని చూస్తోంది. వివిధ రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి కైలాష్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమేరామ్ బేనివాల్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థి 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి పోటీలో ఉండటంతో అందిరి దృష్టి ఈ నియోజక వర్గంపై పడింది.
ఆకట్టుకునే ప్రసంగాలు
బార్మర్ జిల్లాలోని షియో అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయాన్ని రుచి చూసిన రవీంద్ర, ఇప్పుడు మరోసారి బరిలోకి దిగి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే సాంప్రదాయ ద్విముఖ భావాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా భాటి ప్రజాదరణ ఆయన సొంత నియోజకవర్గానికి మించి విస్తరించింది. ఈయన ఆకర్షణ, ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించాయి.
ప్రచారం ముమ్మరం కావడంతో భాటి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మక పర్యటనను ప్రారంభించారు. రవీంద్ర భాటి బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఆయన ప్రసంగాన్ని వినడానికి అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. అదేవిధంగా హైదరాబాద్‌లోనూ ప్రజాదరణ లభించింది. ఆయన విమానాశ్రయానికి రాకముందే జనాలను ఆకర్షించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకున్నప్పుడు అతని పేరు కొన్ని మైళ్ల వరకు ప్రతిధ్వనించింది.
రవీంద్ర భాటి నేపథ్యం
రవీంద్ర సింగ్ భాటి బార్మెర్‌లోని దుధోడా అనే గ్రామానికి చెందిన రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యాయ విద్యను అభ్యసించిన రవీంద్ర భాటి తన పాఠశాల విద్యను ప్రభుత్వ స్కూల్‌లో పూర్తి చేశారు.
జై నారాయణ్ వ్యాస్ యూనివర్శిటీలో 2019 విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రవీంద్ర భాటి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ నుంచి మొదట టికెట్‌ను కోరినప్పటికీ, చివరికి తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో అతని విజయం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. విశ్వవిద్యాలయం 57 సంవత్సరాల చరిత్రలో విద్యార్థి సంఘం అధ్యక్ష పదవిని గెలుచుకున్న మొదటి స్వతంత్ర అభ్యర్థిగా రవీంద్ర సింగ్ బాటీ నిలిచాడు.
అలాగే బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో భాటి రాజకీయ పథం మరో ముఖ్యమైన మలుపు తిరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను ఎదుర్కొని భాటి విజయం సాధించారు. సుమారు 4 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో లోక్‌సభ బరిలో నిలిచారు.
#संबोधन pic.twitter.com/4CU0fnZTwe
— Ravindra Singh Bhati (@RavindraBhati__) April 9, 2024
Comments
Please login to add a commentAdd a comment