అతినిద్ర ఆల్కాహాల్ కన్నా డేంజర్!
సిడ్నీ: ‘అతినిద్రా లోలుడు తెలివిలేని మూర్ఖుడు’ అని ఊరికే అనలేదేమో కవి. రోజుకు తొమ్మిది గంటలకు మించి నిద్రపోతే తొందరగా చస్తామట. ఇది ఆల్కహాల్, ధూమపానం సేవించడం కన్నా డేంజరని సిడ్నీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజులో ఎక్కువ గంటలు కూర్చోవడం, ఎక్కువ గంటలు నిద్రపోవడం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు ఏమిటనే అంశంపై వారు 2,30,000 మంది ఆరోగ్య పరిస్థితిని క్షుణ్నంగా అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు.
సాధారణ మనషులకన్నాఎక్కువ నిద్రపోయేవారు, ఎక్కువ కూర్చునే వారు త్వరగా చనిపోవడానికి నాలుగు రెట్లు అవకాశం ఉందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ మెలోడి డింగ్ తెలిపారు. అతిగా మద్యం, ధూమపానం సేవించడం కన్నా ఇది దాదాపు రెండింతలు డేంజరని ఆయన చెప్పారు. అలా అని తక్కువ గంటలు నిద్రపోవడం కూడా డేంజరట. ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగిన వాళ్లు సరాసరి ఆరు గంటలు నిద్రపోవడం క్షేమదాయకమని అన్నారు. అదే మద్యం సేవించే వారు రాత్రిపూట సరాసరి ఏడు గంటలు నిద్రపోవడం ఆరోగ్యకరమని ఆయన వివరించారు.