సరిహద్దులో కాల్పుల విరమణను రోజూ ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ సైన్యం తీవ్ర తప్పిదాలు చేస్తోందని, సరైన సమయంలో దిమ్మతిరిగే సమాధానం ఇస్తామని భారత సైన్యం హెచ్చరించింది.
రాజౌరీ(జమ్మూకాశ్మీర్): సరిహద్దులో కాల్పుల విరమణను రోజూ ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ సైన్యం తీవ్ర తప్పిదాలు చేస్తోందని, సరైన సమయంలో దిమ్మతిరిగే సమాధానం ఇస్తామని భారత సైన్యం హెచ్చరించింది. నియంత్రణ రేఖ వద్ద పాక్ ఆగడాలు తమ ధైర్యాన్ని నీరుగార్చలేవని 25వ పదాతిదళ జన రల్ ఆఫీసర్ కమాండింగ్(జీఓసీ) మేజర్ జనరల్ వీపీ సింగ్ అన్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై పొరుగు దేశానికి ఏం చెప్పాలనుకుంటున్నారని ఆదివారమిక్కడ విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు. ‘ఇది సైనిక వ్యవహారం. సమయం చూసుకుని తగినచోట, తగిన జవాబిస్తాం’ అని అన్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘన, చొరబాట్లను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ తనకు ఆదేశాలిచ్చారన్నారు. కాగా, నియంత్రణ రేఖ వద్ద తమ పోస్టులపై మరిన్ని దాడులకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తున్నట్లు, 300 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని పూంచ్ సెక్టార్‌లోని ఆర్మీ అధికారి ఎ.సేన్‌గుప్తా చెప్పారు. ఉగ్రవాదులు చొరబండేందుకు వీలుగా పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయన్నారు. తమ ఎదురు కాల్పుల్లో పాక్‌కు చెందిన ఐదు ఆర్మీ పోస్టులు ధ్వంసమయ్యాయని వెల్లడించారు.