జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద పాకిస్థాన్ బలగాలు మరోసారి భారీ స్థాయిలో కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. ఇదే ప్రాంతంలో ఇటీవల ఐదుగురు భారత సైనికులను మట్టుబెట్టిన పాక్ సైన్యం, శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఎల్‌ఓసీ వద్ద ఉన్న భారత సైనిక స్థావరాలపై భారీ స్థాయిలో గుళ్ల వర్షం కురిపించింది. మోర్టార్లు సహా భారీ ఆయుధాలతో పాక్ బలగాలు దాదాపు ఏడు గంటల సేపు, ఏడువేల రౌండ్లు కాల్పులు జరిపాయి. భారత సైన్యం కూడా తిరిగి కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. పూంచ్ జిల్లాలోని దుర్గా బెటాలియన్ ప్రాంతంపై శుక్రవారం రాత్రి 10.20 గంటల నుంచి పాక్ సైన్యం కాల్పులు జరిపిందని, భారత సైనికులు దీటుగా బదులు చెప్పారని రక్షణశాఖ ప్రతినిధి ఎస్.ఎన్.ఆచార్య తెలిపారు.