పాకిస్థాన్‌పై ట్రంప్ తాజా ట్విస్టు!
- నాడు ప్రమాదకరమైన దేశమంటూ వ్యాఖ్యలు
- నేడు అద్భుతమైన దేశమని కితాబు..
- ట్రంప్‌కు షరీఫ్ ఫోన్.. ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన డొనాల్డ్ అధ్యక్షుడు కాగానే.. తన వైఖరి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. నాడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్ అని, దీనిని నిరోధించగలిగేది ఒక్క భారత్ మాత్రమేనని పేర్కొన్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా పాకిస్థానీలు అత్యంత తెలివైనవాళ్లు అంటూ సరికొత్త ట్విస్టు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బుధవారం పాకిస్థాన్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చారు. పాకిస్థాన్‌కు చెందిన ఏ సమస్యలైనా పరిష్కరించడానికి తాను సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు తెలిపారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఫోన్ చేసి షరీఫ్ అభినందించిన సందర్భంగా.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అపరిష్కృతంగా ఉన్న ఎలాంటి సమస్యల పరిష్కారంలోనైనా నా వంతు పాత్ర పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనిని నేను గౌరవంగా భావించి వ్యక్తిగతంగానూ కృషి చేస్తాను. నేను అధ్యక్ష పదవి స్వీకరించే జనవరి 20లోపు కూడా కావాలంటే ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు’ అని ట్రంప్ పేర్కొన్నట్టు పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, తాను పరిష్కరించదలుచుకున్న అపరిష్కృత సమస్యలు ఏమిటన్నది ట్రంప్ వివరణ ఇవ్వలేదు.
అదేవిధంగా షరీఫ్‌పైనా ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనకు మంచి పేరుప్రఖ్యాతలు ఉన్నాయని, అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. పాకిస్థాన్ అద్భుతమైన అవకాశాలు గల దేశమని, పాకిస్థానీలు అద్భుతమైన తెలివితేటలు గల మనుష్యలని పొగడ్తల్లో ట్రంప్ ముంచెత్తారు. పాకిస్థాన్‌కు రావాల్సిందిగా షరీఫ్ ఆహ్వానించగా, ఆ అద్భుతమైన దేశానికి రావడం తనకెంతో ఇష్టమని, పాకిస్థానీలు అద్భుతమైన వ్యక్తులని తాను చెప్పినట్టు వారికి చెప్పాలని షరీఫ్‌కు సూచించారు.