'బ్యాక్ ఎండ్లో కశ్మీర్ సమస్యకు పరిష్కారం'
ఇస్లామాబాద్: ప్రధాన సమస్య జోలికి పోకుండా మిగతా అంశాలపై దశలవారీగా చర్చలు జరపడం.. తద్వారా అసలు సమస్య పరిష్కారానికి కావాల్సినంత సానుకూలతను సృష్టించడం దౌత్యనీతి. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ లు ఇలాంటి వెనుక మార్గపు దౌత్యాన్ని(బ్యాక్ ఎండ్ డిప్లమసీ) అనుసరిస్తున్నాయని పాకిస్థాన్ ప్రధానికి జాతీయ భద్రత, విదేశీవ్యవహారాల సలహాదారు సర్తజ్ అజీజ్ అన్నారు.
షాంఘై సహకార సంస్థ సమావేశంలో భాగంగా రష్యాలోని ఉఫా నగరంలో చర్చించుకున్న భారత్, పాక్ ప్రధానుల చర్చల్లో కశ్మీర్, సియాచిన్, సర్ క్రీక్ వంటి కీలక అంశాలపై ఎలాంటి ప్రస్తావన రాకపోవడంపై ఇటు భారత్ సహా, అటు పాకిస్థాన్ లోనూ కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అయితే ప్రధాన సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయని, అయితే చిక్కుముడిని ఒక్కసారే విప్పడంకంటే సావధానంగా వ్యవహరించడం ఉత్తమమని అజీజ్ పేర్కొన్నారు. మోదీతో చర్చల సందర్భంలో షరీఫ్ వెంట అజీజ్ కూడా పాల్గొన్నారు.