
సామియాను మొదటి భర్తే చంపేశాడు
బ్రిటీష్ సంతతికి చెందిన పాకిస్థానీ యువతి సామియా షాహిత్ హత్యకేసు మిస్టరీ వీడింది.
లాహోర్: బ్రిటీష్ సంతతికి చెందిన పాకిస్థానీ యువతి సామియా షాహిద్ హత్యకేసు మిస్టరీ వీడింది. షియా తెగకు చెందిన వ్యక్తిని సామియా రెండో పెళ్లిచేసుకుందనే కారణంతో ఆమె మాజీ భర్త చౌధురీ షకీల్ చంపేశాడు. సామియా తల్లిదండ్రుల సమ్మతితోనే ఆమెను హత్యచేసినట్టు షకీల్ చెప్పాడు. నేరం చేసినట్టు షకీల్ విచారణలో అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు.
పంజాబ్ ప్రావిన్స్లోని జెలుం జిల్లాలో సామియా తల్లిదండ్రుల ఇంట్లో గత నెల 20న ఆమె హత్యకు గురైంది. వేరే తెగకు చెందిన వ్యక్తిని తన మాజీ భార్య పెళ్లిచేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయానని, అందుకే ఆమెను హత్య చేశానని షకీల్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసులో సామియా తల్లిదండ్రులు ప్రమేయముందని, వారిని కూడా విచారించాలని షకీల్ పోలీసులకు చెప్పాడు. సామియా తల్లిదండ్రుల సమ్మతితోనే ఆమెను హత్యచేసినట్టు వెల్లడించాడు. కాగా ఈ కేసులో షకీల్ను కాపాడేందుకు సామియా తల్లిదండ్రులు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. కేసును కప్పిపుచ్చేందుకు సామియా తండ్రి విరుద్ధ వాంగ్మూలాలు ఇచ్చినట్టు చెప్పారు. షకీల్తో పాటు సామియా తండ్రిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పాకిస్థాన్లో పరువు హత్యలు తరచూ జరుగుతున్నాయి.