ఇస్లామాబాద్: సాధారణంగా కన్న బంధాన్ని వదులు కోవడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే పేదరికంలో ఉన్న ఓ కుటుంబం విధిలేని పరిస్థితుల్లో పేగు బంధాన్ని వదులుకుంది. ఏకంగా నలుగురు పిల్లల్ని అమ్మకాని పెట్టి.. వచ్చి న డబ్బుతో కోర్టుకు జరిమానా కట్టేందుకు సిద్ధపడింది. వివరాల్లోకి వెళితే.. గులామ్ రసూల్ కతోర్ అనే వ్యక్తి రూ.10 లక్షలకు నలుగురు పిల్లల్ని అమ్మేశాడు. గులామ్ కొడుకు గిరిజన మహిళను రెండో వివాహం చేసుకోవడమే ఇందుకు కారణమట. దీనికి సంబంధించి బాధిత మహిళ తన మోసం చేశారంటూ కోర్టును ఆశ్రయించింది.
గత రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్న కేసులో ఆ మొత్తాన్ని బాధిత మహిళకు చెల్లించాలని జిర్గా (ట్రైబల్ కోర్టు) ఆదివారం తన తీర్పులో పేర్కొంది. తనకు తగిన ఆర్థికస్తోమత లేని కారణంగా కుటుంబంలోని నలుగురు పిల్లల్ని పది లక్షల రూపాయిలకు మంగళవారం అమ్మేశానని రసూల్ పేర్కొన్నాడు. తన కుటుంబాన్ని కేసు నుంచి కాపాడుకునేందుకు పిల్లలను అమ్మేసినట్లు తెలిపాడు. అలా అమ్మేసిన చిన్నారుల్లో అంతా నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల లోపు వారే.