
రైతు సమస్యలకు పరిష్కారం చూపాలి
‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తిసాక్షి, హన్మకొండ: రైతు సమస్యలకు పరిష్కారం చూపించేలా పార్లమెంటు ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చ జరగాలని సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి అన్నారు. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అందించే శాంతిదూత అవార్డుకు 2015 సంవత్సరానికి ప్రవాస భారతీయురాలు దూదిపాల జ్యోతిరెడ్డి ఎంపికయ్యారు. వరంగల్‌లో ఆదివారం జరిగిన ఈ అవార్డు బహూకరణ కార్యక్రమానికి రామచంద్రమూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విజయ్‌మాల్యా వంటి బడా పారిశ్రామిక వేత్తలు చేసిన అప్పులతో పోల్చితే... రైతులు చేసే అప్పులు చాలా చిన్నవని అన్నారు. అప్పుల పాలైన రైతులు, ఆత్మన్యూనతా భావానికి లోనై బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీగా జీవితం ప్రారంభించి అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా ఎదిగిన ప్రవాస భారతీయురాలు జ్యోతిరెడ్డి జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆశయాలు ఉండటం గొప్పకాదని, వాటిని ఆచరించడం గొప్పని అన్నారు. శాంతి స్థాపన కోసం వరల్డ్ పీస్ సంస్థ చేస్తోన్న కృషిని అభినందించారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ మహిళలందరికీ జ్యోతిరెడ్డి ఆదర్శప్రాయమన్నారు. జ్యోతిరెడ్డి అనుమతిస్తే ఆమె జీవిత గాథను నవలగా రాస్తానని జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు.