బలపరీక్షలో నెగ్గిన పారికర్!
గోవాలో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించింది. గురువారం గోవా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించిన బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకుంది. మనోహర్ ప్రభుత్వానికి అనుకూలంగా 22 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 16 ఓట్లు పడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 21.
40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో బీజేపీ గెలిచింది 13 స్థానాలే. ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు పలుకడంతో మెజారిటీతో బలపరీక్ష గండాన్ని బీజేపీ అధిగమించింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు పది స్థానాలు గెలుపొందారు. ఇందులో గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలుకడంతో బీజేపీకి 22 ఓట్లు పడ్డాయి.
కాంగ్రెస్ పార్టీ కన్నా తక్కువ స్థానాలు గెలుపొందినప్పటికీ, కేంద్ర రక్షణమంత్రిగా ఉన్న పారికర్‌ను ముఖ్యమంత్రిగా బరిలో నిలిపి.. వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీజేపీ ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతును కూడగట్టింది. దీంతో బిత్తరపోయిన కాంగ్రెస్ పార్టీ సీఎంగా పారికర్ ప్రమాణాన్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పారికర్ ప్రమాణంపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. గురువారమే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలంటూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఎట్టిపరిస్థితుల్లో ఈ బలపరీక్షలో పారికర్ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతామని గురువారం కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు.