గుజరాత్‌లో పటేల్ గిరీ | Patidar rally youth leader Hardik Patel arrested in Ahmedabad | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో పటేల్ గిరీ

Published Wed, Aug 26 2015 1:08 AM | Last Updated on Tue, Aug 21 2018 2:30 PM

మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన 'మహాక్రాంతి ర్యాలీ' సభకు హాజరైన జనం. (ఇన్ సెట్)లో కన్వీనర్ హార్దిక్ పటేల్ అరెస్టు దృషం - Sakshi

మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన 'మహాక్రాంతి ర్యాలీ' సభకు హాజరైన జనం. (ఇన్ సెట్)లో కన్వీనర్ హార్దిక్ పటేల్ అరెస్టు దృషం

ఓబీసీలో చేర్చాలంటూ అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ
* లేదంటే రాష్ట్రంలో బీజేపీ ఓటమి ఖాయమని హెచ్చరిక

అహ్మదాబాద్: ఇతర వెనకబడిన తరగతుల్లో(ఓబీసీ) తమను చేర్చాలంటూ గుజరాత్‌లోని పటేల్ సామాజిక వర్గం చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) ఆధ్వర్యంలో మంగళవారం అహ్మదాబాద్‌లో ‘మహా క్రాంతి ర్యాలీ’ పేరుతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు.

పటేల్ వర్గాన్ని ఓబీసీల్లో చేర్చకపోతే 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని, కమలం వికసించబోదని పీఏఏఎస్ కన్వీనర్ హార్దిక్ పటేల్ హెచ్చరించారు. సీఎం ఆనందీబెన్ పటేల్ వచ్చి తమ నుంచి వినతి పత్రం స్వీకరించేంతవరకు వేదిక వద్దే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. పటేళ్ల కోసం పనిచేయని కాంగ్రెస్‌ను 1985లో రాష్ట్రంలో నేలమట్టం చేశామని, అదే తీరున వ్యవహరిస్తే బీజేపీకీ అదే గతి పడ్తుందన్నారు. ‘ఒక ఉగ్రవాది కోసం తెల్లవారుజామున సుప్రీంకోర్టును తెరిచారు.

దేశం కోసం, యువత భవితవ్యం కోసం ఆ పనిచేయలేరా?’ అని ఆగ్రహంగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని 1.8 కోట్ల మంది పటేళ్లు రోడ్లమీదికొస్తే ప్రభుత్వమే ఓబీసీ కోటా ఇస్తుందన్నారు. అంతకుముందు, సుప్రీంకోర్టు తీర్పులను కారణంగా చూపుతూ పటేల్ వర్గాన్ని ఓబీసీల్లో చేర్చడానికి సంబంధించి తన అశక్తతను ఆనందీబెన్ పటేల్ పటేల్ సామాజిక వర్గ నేతలకు వివరించినప్పటికీ నిరసనను విరమించేందుకు వారు అంగీకరించలేదు.

గుజరాత్‌లో ఆర్థికంగా, సామాజికంగా, సంఖ్యాపరంగా బలమైన పటేల్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. దాంతో అహ్మదాబాద్ నగరం కొన్ని గంటలపాటు స్తంభించిపోయింది. ర్యాలీ సందర్భంగా పటేల్ సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య.. అలాగే వాదజ్‌లో దళితులు, పటేల్ వర్గీయులకు మధ్య గొడవలు జరగడంతో నగరంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సిటీ బస్సులను తగలబెట్టి ధ్వంసం చేశారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

పోలీసులు దౌర్జన్యం చేయడం వల్లనే  ర్యాలీ హింసాత్మకమైందని హార్దిక్ పేర్కొన్నారు. అంతకుముందు సభలో మాట్లాడుతూ.. తమ ఉద్యమం రాజకీయాలకు అతీతమైందన్నారు. దేశవ్యాప్తంగా తమకు 170 మంది ఎంపీలున్నారన్నారు. ‘బిహార్‌లోని నితీశ్ మావాడే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మావాడే’ అన్నారు.
 
హార్దిక్ అరెస్ట్, విడుదల.. అనంతరం, మరో ముగ్గురితో కలిసి వేదిక వద్ద ఆమరణ దీక్షకు దిగిన హార్దిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. రాష్ట్రమంత్రి రజిని పటేల్ ఇంటికి నిప్పంటించే ప్రయత్నం చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారడం తో కాసేపటి తరువాత హార్దిన్‌కు  విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement