ఈ-వాలెట్స్కి పేటీఎం ఇన్సూరెన్స్
ఈ-వాలెట్స్కి పేటీఎం ఇన్సూరెన్స్
Published Tue, Mar 21 2017 12:28 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
మొబైల్ వాలెట్లలో నగదును దాచుకునేందుకు భయాందోళనలు వ్యక్తంచేసే వినియోగదారుల కోసం ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజం పేటీఎం సరికొత్త సేవలందించేందుకు సిద్దమైంది. తమ ఈ-వాలెట్లో దాచుకునే నగదుకు ఇన్సూరెన్స్ అందిస్తామని పేర్కొంది. మోసపూరిత లావాదేవీలతో వాలెట్లోని నగదు దొంగతనానికి గురైనా, నష్టం ఏర్పడినా యూజర్లకు ఆ నగదును రీఫండ్ చేస్తామని తెలిపింది. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం ఎలాంటి అదనపు ఖర్చులుండవని వెల్లడించింది. సైబర్ దొంగతనాలు ఎక్కువవుతున్న క్రమంలో ఈ-వాలెట్, ఇన్సూరెన్స్ కంపెనీలు జతకలిసి పనిచేయాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు ఈ-వాలెట్ సంస్థలు తమ యూజర్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ ను అందిస్తున్నాయి. రూ.20వేల వరకు వాలెట్ బ్యాలెన్స్ ఉండే కస్టమర్లందరికీ ఇన్సూరెన్స్ అందిస్తామని కంపెనీ పేర్కొంది.
ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా కస్టమర్లు 12 గంటల లోపల ఈ-మెయిల్ ద్వారా లేదా కస్టమర్ కేర్ కు కాల్ చేసైనా కంపెనీకి రిపోర్టు చేయాలని పేటీఎం సూచించింది. ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవలే బ్యాంకర్లు, మొబైల్ వాలెట్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ లతో భేటీ అయి, డిజిటల్ లావాదేవీల ఎలా సురక్షితంగా ఉంచాలి అనే అంశంపై చర్చించారు. డిజిటల్ లావాదేవీల సురక్షితంలో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతో కీలకమని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతకముందే లక్షల కొలదీ డెబిట్, క్రెడిట్ కార్డుల చోరి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీల భద్రత ప్రస్తుతం అతిపెద్ద సవాల్ గా మారింది.
Advertisement
Advertisement