పేటీఎంలో 20వేల ఉద్యోగాలు
పేటీఎంలో 20వేల ఉద్యోగాలు
Published Fri, Dec 9 2016 4:11 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
పేటీఎంలో కొత్తగా 20వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సంస్ధ వ్యవస్ధాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు అనంతరం పేటీఎం ద్వారా జరిపే నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. దేశంలోని 650 జిల్లాల్లో పేటీఎం సేల్స్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.
ప్రస్తుతం పేటీఎంలో 11వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వీరిలో 1500 మంది గత ముప్ఫై రోజుల్లో చేరిన వారే కావడం గమనార్హం. యాప్ డేటా ట్రాకర్ 'యాప్ అన్నీ' ప్రకారం.. భారతదేశంలో పేటీఎంకు 88 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీరందరూ రెగ్యులర్ గా యాప్ ను వినియోగిస్తున్నట్లు కూడా 'యాప్ అన్నీ' పేర్కొంది.
ఒక జిల్లాకు 10మంది సేల్స్ బృందాన్ని పంపే యోచనలో ఉన్నట్లు విజయ్ శేఖర్ చెప్పారు. డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నీతి ఆయోగ్ తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఫీచర్ ఫోన్లలో వాలెట్ సర్వీసులను ప్రవేశపెట్టిన తర్వాత చిన్న వ్యాపారుల్లో యాప్ వినియోగం బాగా పెరిగినట్లు చెప్పారు. పేటీఎం వినియోగదారుడు ఎవరైనా టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి పేమెంట్ చేయొచ్చని వెల్లడించారు.
సెకనుకు 1300 కాల్స్ ను హ్యాండిల్ చేయగల సామర్ధ్యానికి తమ నెట్ వర్క్ పరిధిని పెంచుకున్నట్లు చెప్పారు. రోజుకు కనీసం రూ.150 కోట్ల నగదు రహిత లావాదేవీలు యాప్ ద్వారా జరుగుతున్నట్లు చెప్పారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దుకు ముందు రోజుకు రూ.40 కోట్ల లావాదేవీలు మాత్రమే జరిగేవని వెల్లడించారు.
Advertisement
Advertisement