అది నాకు పర్సనల్ అవమానమే!
వాషింగ్టన్: రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకుండా అడ్డుకోవాలని ఆఫ్రికన్-అమెరికన్లయిన నల్లజాతి ఓటర్లకు అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. నల్లజాతి ఓటర్లు రానున్న ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు ఓటువేయకపోతే అది వ్యక్తిగతంగా తనకు, తన వారసత్వానికి అవమానంగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు.
శనివారం జరిగిన అమెరికా చట్టసభ (కాంగ్రెస్)లోని నల్లజాతి సభ్యుల సమావేశంలో అధ్యక్షుడిగా ఒబామా చివరి ప్రసంగం చేశారు. 'మా ఓటుకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎవరిని ఎన్నుకున్నా పెద్దగా తేడా ఉండదు అని ఎవరైనా అనుకుంటే.. ఓసారి మీ సొంత చరిత్రను చదవమనీ నేను సూచిస్తాను. ప్రతి ఒక్కరి ఓటు కీలకమైనదే. ప్రజలతో మనం ఓటు వేయించాలి' అని ఒబామా సూచించారు.
'ఈసారి ఎన్నికల్లో ఈ (నల్లజాతి) కమ్యూనిటీ చురుగ్గా వ్యవహరించి తన రక్షణలు పొందడంలో విఫలమైతే.. అది వ్యక్తిగతం నాకు, నా వారసత్వానికి అవమానంగా భావిస్తాను. నాకు ఘనమైన వీడ్కోలు చెప్పాలనుకుంటే వెళ్లి ఓటు వేయండి' ఒబామా సూచించారు. ఈ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పై పరుషమైన వ్యాఖ్యలతో ఒబామా విరుచుకుపడ్డారు. పౌరహక్కులపై దాడి చేసినవాడు, సమానత్వానికి వ్యతిరేకంగా పోట్లాడే వాడు, తన జీవితంలో ఎనాడూ కార్మికులను గౌరవించని వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అని మండిపడ్డారు. అమెరికాలోని నల్లజాతీయుల సంక్షేమం వారు తన పార్టీకి చెందిన డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి అండగా నిలువాల్సిందేనని ఒబామా స్పష్టం చేశారు.