African American community
-
కోవిడ్‌తో తొలి ఆఫ్రికన్ అమెరికన్ ఫారిన్ సెక్రటరీ కన్నుమూత
వాషింగ్టన్: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, తొలి నల్లజాతి జాతీయ భద్రతా సలహాదారు కోలిన్ లూథర్ పావెల్ (84) కన్నుమూశారు. కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో మరణించినట్లు పావెల్ కుటుంబం సోమవారం ప్రకటించింది. అద్భుతమైన, ప్రేమగల భర్త, తండ్రి, తాతను, గొప్ప అమెరికన్‌ను కోల్పోయామంటూ పావెల్ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. పావెల్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కూడా వెల్లడించింది. ఈ సందర్బంగా ఆయనకు చికిత్సఅందించిన వైద్య సిబ్బందికి ఫేస్బుక్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. కాగా రిపబ్లికన్ రాజకీయవేత్త అయిన పావెల్ టాప్ మిలిటరీ ఆఫీసర్‌గా పనిచేశారు. 2000లో జార్జ్ డబ్ల్యూ బుష్ ఆధ్వర్యంలో తొలి ఆఫ్రికన్-అమెరికన్ విదేశాంగ కార్యదర్శిగా ఘనతను సాధించారు. బుష్ పరిపాలనలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2001-2005 వరకు బుష్ క్యాబినెట్లో పనిచేసిన పావెల్ సెప్టెంబరు 11 ఉగ్ర దాడుల తరువాత గందరగోళ పరిస్థితుల నిర్వహణలో కీలక భూమికను నిర్వహించారు. అయితే ఇరాక్ యుద్ధం సందర్భంగా పావెల్ తీవ్ర విమర్శలపాలయ్యారు. -
ఆ పోలీసు అధికారి దోషి
వాషింగ్టన్: అమెరికా సహా ప్రపంచ దేశాల్లో సంచలనం సృష్టించిన ఆఫ్రికన్ అమెరికాన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను దోషిగా తేలుస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. 12 మంది జ్యూరీ సభ్యులున్న కోర్టు ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా చేయని సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్ అని మంగళవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. చౌవిన్ బెయిల్‌ని రద్దు చేసింది. మూడు వారాల పాటు 45 మంది సాక్షుల్ని విచారించిన కోర్టు సోమవారం 10 గంటలకు పైగా తుది విచారణ జరిపింది. అయితే శిక్షను న్యాయస్థానం వాయిదా వేసింది. న్యాయమూర్తి పీటర్ కాహిల్ 8 వారాల్లో శిక్ష ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా అమెరికా చట్టాల ప్రకారం చౌవిన్‌కు 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. తీర్పు వెలువరించిన సమయంలో డెరెక్ చౌవిన్‌కు ముఖానికి సర్జికల్ మాస్కు ధరించి ఉండడంతో అతని ముఖంలో భావాలేవీ బయటకు రాలేదు. మరోవైపు ఫ్లాయిడ్ మృతితో జాతి వివక్షకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించిన వారు, ఫ్లాయిడ్ మద్దతు దారులు న్యాయస్థానం తీర్పు చెప్పినప్పుడు కోర్టు హాలు బయటే వేచి ఉన్నారు. తీర్పు వెలువడగానే పెద్ద పెట్టున హర్షాతిరేకాలు చేశారు. అతనికి ఉరిశిక్ష వేయాలంటూ నినదించారు. ఈ తీర్పు ఓ ముందడుగు: బైడెన్ జాతి వివక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఈ తీర్పు అతి పెద్ద ముందడుగు అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తీర్పు వచ్చిన తర్వాత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి వైట్ హౌస్నుంచి ఆయన మాట్లాడారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలకి కాంగ్రెస్ సభ్యులందరూ ఇంకా కృషి చేయాలన్నారు. ‘‘ఈ తీర్పు చాలదు. మనం ఇక్కడితో ఆగిపోకూడదు. అయితే న్యాయవ్యవస్థలో ఇదో పెద్ద ముందడుగు’’అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన బైడెన్ ఎంతో కొంత న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పు తో తాను ఊరట పొందానని అన్నారు. ఐ కాంట్ బ్రీత్ అన్న జార్జ్ ఫ్లాయిడ్ ఆఖరి మాటలు అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇది కేవలం నల్లజాతీయుల సమస్య కాదని, ప్రతీ అమెరికన్ సమస్యని అన్నారు. అందరికీ న్యాయం అని తాము కంటున్న కలల్ని జాతి వివక్ష దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరి పీల్చుకున్నాం : ఫ్లాయిడ్ సోదరుడు పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చడంతో తామంతా ఊపిరిపీల్చుకున్నామని ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనైస్ అన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన అనుకూలంగా తీర్పు వచ్చినా జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఊపిరి ఆడట్లేదు... కాలు తీయండి నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ మిన్నియాపాలిస్‌లోని ఒక దుకాణంలో నకిలీ 20 డాలర్ల నోటుతో సిగరెట్లు కొనుగోలు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆ దుకాణంలో పని చేసే ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసు అధికారిగా ఉన్న శ్వేతజాతీయుడు డెరెక్ చౌవిన్ 2020, మే 25 రాత్రి ఫ్లాయిడ్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. 46 ఏళ్ల వయసున్న ఫ్లాయిడ్‌ను రోడ్డుమీదకి ఈడ్చుకొచ్చాడు. తన మోకాలితో ఫ్లాయిడ్ మెడపై గట్టిగా నొక్కి పెట్టి ఉంచాడు. ఫ్లాయిడ్ ఊపిరి ఆడడం లేదంటూ ఎంత మొరపెట్టుకున్నా చౌవిన్ కర్కశ హృదయం కరగలేదు. తొమ్మిది నిమిషాలు పైగా అలా తొక్కి పెట్టి ఉంచాడు. దీంతో ఫ్లాయిడ్ గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకి రావడంతో ప్రజలు ఆగ్రహోద్రిక్తులయ్యారు. ‘‘ఐ కాంట్ బ్రీత్. ఐ కాంట్ బ్రీత్’’అన్న ఫ్లాయిడ్ చివరి మాటలు విన్న వారి హృదయాలు కరిగి నీరయ్యాయి. -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
-
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
లాస్ ఏంజెలిస్/లండన్: ప్రిన్స్ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్ రాచకుటుంబంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలను అనుభవించానని ఆఫ్రికన్ అమెరికన్ నటి మేఘన్ మార్కెల్ వెల్లడించారు. చాలా ఒంటరితనం అనుభవించానని, తన మానసిక వేదనకు పరిష్కారం లేదనిపించిందని, ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించానని వెల్లడించారు. ఇక జీవించాలనుకోవడం లేదని హ్యారీతో కూడా చెప్పానన్నారు. ఈ విషయంలో వైద్య సహాయం పొందేందుకు కూడా అవకాశం కల్పించలేదని, దానివల్ల రాజకుటుంబ పరువుప్రతిష్టలకు భంగం కలుగుతుందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చాట్ షోలో పలు సంచలన విషయాలను ఆమె ప్రఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రేతో పంచుకున్నారు. అమెరికాలో సీబీఎస్ నెట్వర్క్ చానల్లో ఆదివారం ఆ కార్యక్రమం ప్రసారమైంది. కుటుంబంతో విభేదాల కారణంగా గత సంవత్సరం మార్చిలో ప్రిన్స్ హ్యారీ దంపతులు, తమ ఏడాది కుమారుడు ఆర్చీతో కలిసి రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. ఓప్రా విన్ఫ్రే కార్యక్రమంలో మేఘన్ భర్త ప్రిన్స్ హ్యారీ కూడా పాల్గొని, పలు రాచకుటుంబ రహస్యాలను వెల్లడించారు. వివాహం తరువాత కొత్తగా రాచకుటుంబంలోకి వెళ్లిన తనకు కొద్ది రోజుల తరువాత ఆదరణ కన్నా అవమానాలే ఎక్కువ ఎదురయ్యాయని మేఘన్ తెలిపారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఊహించని స్థాయిలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానన్నారు. నలుపురంగులో పుడితే ఎలా..? ‘పుట్టబోయే చిన్నారి రంగు గురించి రాచకుటుంబం మాట్లాడుకుంది. నేను నలుపు కనుక బిడ్డ కూడా నలుపు రంగులోనే పుడితే ఎలా?’అని వారు ఆలోచించారని తెలిపారు. పుట్టబోయే బిడ్డకు రాజకుటుంబం నుంచి లభించే ‘ప్రిన్స్’హోదా ఇవ్వకూడదని నిర్ణయించారని, అందువల్ల రాజకుటుంబ సభ్యులకు లభించే భద్రత కూడా అందదని తేల్చేశారని వివరించారు. ఈ విషయాలను హ్యారీ తనతో పంచుకున్నారని, వాటిని జీర్ణించుకోవడం తమకు కొన్నాళ్ల పాటు సాధ్యం కాలేదని తెలిపారు. అయితే, బిడ్డ రంగు గురించిన వ్యాఖ్యలు ఎవరు చేశారన్న విషయాన్ని మేఘన్ వెల్లడించలేదు. వారి పేరు చెబితే.. వారి ప్రతిష్టకు భారీగా భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఆ విషయమై తనతో రాజకుటుంబ సభ్యులు జరిపిన సంభాషణను తాను కూడా బయట పెట్టాలనుకోవడం లేదని హ్యారీ కూడా స్పష్టం చేశారు. కుటుంబం నుంచి దూరంగా వచ్చేసిన తరువాత తన ఫోన్ కాల్స్‌ను కూడా తన తండ్రి ప్రిన్స్ చార్లెస్ స్వీకరించలేదని హ్యారీ తెలిపారు. అంతకుముందు, నానమ్మ ఎలిజబెత్ రాణితో మూడు సార్లు, తండ్రి ప్రిన్స్ చార్లెస్‌తో రెండు సార్లు మాత్రం మాట్లాడానన్నారు. ‘నా కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమే. కానీ తప్పదు. నేను, నా భార్య మేఘన్, కుమారుడు ఆర్చీల మానసిక ఆరోగ్యం కోసం రాజ కుటుంబానికి దూరం కావాలన్న నిర్ణయం తీసుకున్నాను’అని హ్యారీ వివరించారు. అవన్నీ అవాస్తవాలు.. బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, రాజకుటుంబం నుంచి డబ్బులు రావడం ఆగిపోయిందని హ్యారీ వివరించారు. ఆ సమయంలో తన తల్లి ప్రిన్సెస్ డయానా తన కోసం దాచిన ఆస్తులే తమను ఆదుకున్నాయన్నారు. తమ వివాహం తరువాత రాజకుటుంబం తనకు, తన భర్తకు సరైన భద్రతను కూడా కల్పించలేదని మేఘన్ ఆరోపించారు. రాయల్ వెడ్డింగ్ సందర్భంగా ఫ్లవర్ గర్ల్ డ్రెసెస్ విషయంలో తన తోటి కోడలు, ప్రిన్స్ విలియం భార్య, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేథరిన్(కేట్) మిడిల్టన్ తన కారణంగా కన్నీళ్లు పెట్టుకున్నారన్న వార్తలను ఓప్రా విన్ఫ్రే ప్రస్తావించగా.. అవన్నీ అవాస్తవాలని మేఘన్ తెలిపారు. ‘నిజానికి జరిగింది వేరే. ఆ ఘటనతో నేనే ఏడ్చాను. ఆ తరువాత కేట్ నన్ను క్షమాపణలు కూడా కోరింది’అని వెల్లడించారు. ‘నిజానికి రాయల్ వెడ్డింగ్‌కు మూడు రోజుల ముందే మాకు వివాహం జరిగింది. అది మాకు మాత్రమే ప్రత్యేకమైన ప్రైవేట్ విషయం’అని మేఘన్ పేర్కొన్నారు. వివాహమైన మొదట్లో బాగానే చూసుకున్నారని, ఆ తరువాతే వారిలో మార్పు వచ్చిందని మేఘన్ వివరించారు. ‘మొదట్లో నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు’అన్నారు. ఎలిజబెత్ రాణితో తనకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని, ప్రిన్స్ ఫిలిప్ ఇటీవల అస్వస్థతకు గురైనప్పుడు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడానని వివరించారు. ‘రాజకుటుంబ క్రియాశీల బాధ్యతల నుంచి తప్పుకుని ఎలిజబెత్ రాణిని బాధపెట్టారా?, ఆమెకు చెప్పకుండా ఆ నిర్ణయం తీసుకున్నారా?’అన్న ప్రశ్నకు.. ఈ విషయమై నానమ్మకు, తనకు మధ్య పలుమార్లు చర్చ జరిగిందని హ్యారీ వెల్లడించారు. నానమ్మ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. పాప పుట్టబోతోంది రెండో సంతానంగా తమకు పాప పుట్టబోతోందని ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు వెల్లడించారు. ‘ఫస్ట్ కుమారుడు. ఇప్పుడు పాప. ఇంతకన్నా ఏం కావాలి? మేం నలుగురం. మాతో పాటు రెండు కుక్కలు. ఇదే మా కుటుంబం’అని హ్యారీ ఆనందంగా వివరించారు. టాక్‌షోలో ఓప్రా విన్ఫ్రే మొదట మేఘన్‌తో కాసేపు మాట్లాడిన తరువాత, వారితో హ్యారీ జతకలిశారు. -
అలసిపోయాం.. ఇక ఆపండి!
వాషింగ్టన్: తన సోదరుడిలా నల్లజాతీయులెవరూ అమెరికా పోలీసుల దాష్టీకాలకు బలికాకుండా చూడాలని ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ తమ్ముడు ఫిలోనిస్ ఫ్లాయిడ్ కోరుకున్నారు. జార్జ్ హత్య విచారణలో భాగంగా అమెరికా చట్టసభ(కాంగ్రెస్) ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. అగ్రరాజ్యంలో నల్లజాతీయులపై దారుణాలు కొనసాగుతుండటం పట్ల ఫిలోనిస్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘నేను అలిసిపోయాను. ఇప్పుడు అనుభవిస్తున్న బాధతో నేను విసిగిపోయాను. ఎటువంటి కారణం లేకుండా నల్లజాతీయులు చంపబడిన ప్రతిసారీ అనుభవిస్తున్న బాధతో నేను వేసారిపోయాను. దీన్ని ఆపమని మిమ్మల్ని అడగడానికి నేను ఈ రోజు ఇక్కడకు వచ్చాను. ఈ బాధలు ఇక వద్దు’ అని ఫిలోనిస్ ఫ్లాయిడ్ గద్గత స్వరంతో అన్నారు. జార్జ్ తమ్ముడి మాటలతో విచారణ గది నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక నల్లజాతీయుడి ప్రాణం విలువ 20 వేల డాలర్లా? ఇది 2020. ఇక చాలు’ అన్న ఫిలోనిస్ ఆవేదన అందరినీ కదిలించింది. (ఫ్లాయిడ్‌కు కన్నీటి వీడ్కోలు) ఆ వీడియో బాధ కలిగిస్తోంది.. ‘మంచి పనులు చేస్తూ ఈ దేశానికి, ప్రపంచానికి అవసరమైన నాయకులుగా ఉండండి. పోలీసు హింస, అన్యాయానికి జార్జ్ ఫ్లాయిడ్ మరణం ప్రపంచ ప్రతీక నిలిచింది. కానీ జీవితంలో అతడు తండ్రి, సోదరుడు, సౌమ్యుడైన దిగ్గజం’ అని చట్టసభ సభ్యులతో ఫిలోనిస్ అన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మెడపై ఒక పోలీసు అధికారి మోకాలు ఉంచి ఊపిరాడకుండా చేసిన వీడియో న్యాయం కోసం చేసే ఉద్యమాలకు కొత్త ఊపిరి పోసినప్పటికీ.. పదేపదే జార్జ్ చివరి క్షణాలను గుర్తుచేయడం తమ కుటుంబానికి చాలా క్షోభ కలిగిస్తోందన్నారు. ‘నేను ఆ వీడియో గురించి పదే పదే ఆలోచిస్తాను. మనుషులతో ఎవరూ అలా ప్రవర్తించరు. జంతువులను కూడా అలా చేయరు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సోదరుడి చావుకు కారణమైన పోలీసులను శిక్షించి తమకు న్యాయం చేయాలన్నారు. పోలీసు వ్యవస్థను ఇప్పటికైనా సంస్కరించాలని అమెరికా చట్టసభకు విన్నవించారు. తన సోదరుడి మరణం వృధా కాకుండా ఉండాలంటే వైట్‌హౌస్ సమీపంలోని వీధికి పెట్టిన ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ పేరును కొనసాగించాలని ఫిలోనిస్ కోరారు. (అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్ ) కరోనా కారణంగా వర్చువల్ విధానంలో విచారణ చేపట్టారు. ఫ్లాయిడ్ కుటుంబం తరపు న్యాయవాది బెంజమిన్ క్రంప్, పౌర హక్కుల నాయకులు, చట్టసభ సభ్యులు సహా కొంతమంది మాత్రమే ముఖానికి మాస్కులతో విచారణకు హాజరయ్యారు. పోలీసులు అనుసరిస్తున్న పద్ధతులు, జవాబుదారీతనంలో సంస్కరణలు చేపట్టాలని బెంజమిన్ క్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, పోలీసు విభాగానికి బడ్జెట్‌ను కోత పెట్టాలని, ఈ నిధులను సామాజిక సేవకు వినియోగించాలని ఆందోళకారులు డిమాండ్ చేస్తున్నారు. (పోలీస్ విభాగం రద్దుకు ఓటు) -
అమెరికాలో ఆందోళనలు; ఒబామా స్పందన
జార్జి ఫ్లాయిడ్ హత్యకు, సమాజంలో కొనసాగుతున్న అసమ న్యాయం సమస్యకు వ్యతిరేకంగా అమెరికాలో లక్షలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి గళమెత్తుతున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఎదుర్కొంటున్న ఈ సమస్యలో నిజమైన మార్పు తీసుకొచ్చేలా ఈ ఉద్వేగాలను ఎలా కొనసాగించాలి అని చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు. అంతిమంగా ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించేలా వ్యూహాలను తీర్చిదిద్దవలసిన బాధ్యత తదుపరి తరం కార్యకర్తల మీదే ఉంటుంది. అయితే గతంలో ఈ విషయంపై జరిగిన ప్రయత్నాలనుంచి గ్రహించవలసిన కొన్ని ప్రాథమిక పాఠాలు మనకు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మొదటగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెల్లువలా పెల్లుబుకుతున్న ప్రజా నిరసన కార్యక్రమాలు అనేవి.. పోలీసుల పనితీరులో, నేర న్యాయవ్యవస్థలో విస్తృత ప్రాతిపదికన సంస్కరణలు తీసుకురావడంలో అమెరికాలో దశాబ్దాలుగా సాగుతున్న వైఫల్యం పట్ల నిజమైన, సహేతుకమైన నిరాశా నిస్పృహలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారిలో చాలామంది శాంతియుతంగా, సాహసోపేతంగా, బాధ్యతాయుతంగా ఉంటూ స్ఫూర్తి కలిగిస్తున్నారు. కనుక వీరి నిరసనలను ఖండించడానికి బదులుగా మనందరం గౌరవించాలి. మద్ధతుగా నిలవాలి. నిజానికి కామ్డెన్, ఫ్లింట్ వంటి నగరాల్లోని పోలీసులు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నందుకు వారిని ప్రశంసించాలి కూడా. మరోవైపున, అనేకరూపాల్లో హింసకు పాల్పడిన అతి చిన్న మైనారిటీ బృందాలు నిజమైన ఆగ్రహంతో లేక కేవల అవకాశవాదంతో అలా చేస్తున్నప్పటికీ అమాయకులను వీరు ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే తమ పొరుగున ఉన్న వారికి ఈ హింసాత్మక చర్యల ద్వారా కనీస సేవలు కూడా అందకుండా చేసేలా వీరి చర్యలు ఉంటున్నాయి. పైగా దీర్ఘకాలిక లక్ష్య సాధన నుంచి ఇలాంటి చర్యలు పక్కదోవ పట్టిస్తాయి. నిన్ననే కన్నీళ్లు పెట్టుకున్న ఒక నల్లజాతి మహిళ ఇంటర్వ్యూను చూశాను. తన పొరుగునే ఉన్న కిరాణా దుకాణాన్ని ధ్వంసం చేయడం ఆమెను విషాదంలో ముంచెత్తింది. నిజానికి ఆ దుకాణం మళ్లీ యథాస్థితికి వచ్చి సేవలందించాలంటే సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టే హింసను మనం సమర్థించవద్దు, దాన్ని హేతుబద్ధం చేయవద్దు లేక దాంట్లో పాల్గొనకుండా జాగ్రత్తపడదాం. మన నేర న్యాయవ్యవస్థ కానీ, అమెరికన్ సమాజం కానీ అత్యున్నత నైతిక నియమావళితో పనిచేయాలని మనం కోరుకుంటున్నట్లయితే అలాంటి నైతిక నియమావళిని ముందుగా మనం ఆచరించి చూపాల్సి ఉంది. రెండో విషయం, మన నేరన్యాయ వ్యవస్థలో పదేపదే సాగుతున్న జాతివివక్షా ధోరణిని ఇలాంటి నిరసనలు, ప్రత్యక్ష పోరాటం మాత్రమే మార్చగలుగుతాయని.. ఓట్లు వేయడం, ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడం శుద్ధ దండగమారి వ్యవహారమని కొంతమంది సూచిస్తుండటాన్ని కూడా నేను విన్నాను. ఈ అభిప్రాయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాను. ప్రజల్లో జాగరూకత పెంచడం, అన్యాయాన్ని అక్కడికక్కడే ఎత్తి చూపడం, అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించడమే నిరసనల లక్ష్యంగా ఉండాలి. అమెరికా చరిత్ర పొడవునా ఇలాంటి ప్రజా నిరసనలు, సహాయ నిరాకరణకు స్పందించడం వల్లే, దేశంలోని రాజకీయ వ్యవస్థ అణగారిన బృందాల సమస్యల పట్ల ఆసక్తి చూపిందని గుర్తుంచుకోవాలి. కాబట్టే ప్రజల ఆకాంక్షలు, వారి ఉద్వేగాలు నిర్దిష్ట చట్టాలుగా, సంస్థాగత ఆచరణగా పరివర్తన చెందాయి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మన డిమాండ్ల పట్ల స్పందించేవారిని మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఇది సాకారమవుతుంది. అంతకంటే మించి, మన నేరన్యాయ వ్యవస్థపై, పోలీసుల పనితీరుపై ఎలాంటి ప్రభుత్వం అత్యధిక ప్రభావం వేయగలుగుతుందో మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం రాజకీయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనలో చాలామంది అధ్యక్షుడు, ఫెడరల్ ప్రభుత్వం పట్ల మాత్రమే ఆసక్తి పెంచుకుంటూ ఉంటారు. నిజమే. మన సమాజంలో జాతి వివక్ష పాటిస్తున్న అణచివేత స్వభావాన్ని వాస్తవంగానే అర్థం చేసుకుని దానిపై ఏదో ఒక చర్య తీసుకోవాలంటే.. అధ్యక్షుడు, కాంగ్రెస్, అమెరికన్ న్యాయ విభాగం, ఫెడరల్ న్యాయవ్యవస్థ మనకు తప్పకుండా ఉండితీరాలి. అయితే రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో ఎన్నికైనవారే చాలావరకు పోలీసు శాఖలో, నేరన్యాయవ్యవస్థలో సంస్కరణల గురించి చాలా ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారని మాత్రం మర్చిపోవద్దు. చాలావరకు పోలీసువిభాగం అధిపతులను మేయర్లు, కౌంటీ కార్యనిర్వాహకులే ఎక్కువగా నియమిస్తుంటారు, పోలీసు యూనియన్లతో సమష్టి ఒప్పందాలపై చర్చిస్తుంటారు. పోలీసుల దుష్ప్రవర్తనపై విచారించాలా వద్దా, అంతిమంగా వారిపై నేరారోపణ చేయాలా వద్దా వంటి విధులను జిల్లా అటార్నీలు, రాష్ట్రాల అటార్నీలు నిర్వహిస్తుంటారు. వీరంతా ఎన్నికైనవారే. కొన్ని చోట్ల పోలీసుల వ్యవహార శైలిని పర్యవేక్షించే అధికారాన్ని పోలీసు సమీక్షా మండళ్లకు ఉంటుంది. కానీ ఈ స్థానిక పోటీల్లో పాల్గొనే ఓటర్ల సంఖ్య.. ప్రత్యేకించి యువతీయువకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్యలపై నేరుగా ప్రభావం చూపే ఇలాంటి పదవులను పట్టించుకోకపోవడం తెలివిలేని పని. పైగా.. ఈ కీలకమైన స్థానాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే అంశాన్ని కొన్ని వేలమంది ఓటర్లు లేక కొన్ని వందలమంది ఓటర్లు మాత్రమే నిర్ణయిస్తుంటారు. కాబట్టి నిజమైన మార్పు తీసుకురావాలని మనం కోరుకుంటున్నట్లయితే, అలాంటి అవకాశం నిరసనలు లేక రాజకీయాల్లో ఏదో ఒకదానిపై ఆధారపడి ఉండదు. ఈ రెండూ మనకు కావాలి. ప్రజల్లో జాగరూకతను పెంచడానికి మనం జనాల్ని కూడగట్టాలి. పాలనా సంస్కరణలు తీసుకురాగల అభ్యర్థులను మాత్రమే మనం ఎన్నుకునేలా మన ఓటుహక్కును వినియోగించుకునేలా మనం సంఘటితం కావాలి. చివరగా నేర న్యాయవ్యవస్థలో, పోలీసు విభాగంలో సంస్కరణలపై మనం నిర్దిష్టంగా డిమాండ్లు పెట్టాలి, దీన్ని ముందుకు తీసుకురానట్లయితే ఎన్నికైనవారు ఈ కీలకమైన సంస్కరణ పట్ల నామమాత్రంగా మాత్రమే స్పందిస్తూ, ప్రజా నిరసనలు తగ్గుముఖం పట్టాక యధావిధిగా తమ తమ రోజువారీ పనుల్లో మునిగిపోతారు. కాబట్టి సంస్కరణల ఎజెండా విషయం వివిధ సామాజిక బృందాలకు సంబంధించినంతవరకూ వేరువేరుగా ఉంటుంది. మహానగరం విషయంలో ఒక తరహా సంస్కరణలు అవసరం కావచ్చు. గ్రామీణ ప్రజానీకానికి మరో తరహా సంస్కరణలు అవసరం కావచ్చు. కొన్ని ప్రాంతాలకు పూర్తిగా పునరావాసం అవసరం కావచ్చు. ఇతరులకు కొన్ని సంస్కరణలే అవసరం కావచ్చు. అందుకే ప్రతి శాసన అమలు విభాగం కూడా స్పష్టమైన విధానాలు కలిగి ఉండాలి. ఎక్కడైనా దుష్ప్రవర్తనకు సంబంధించిన పరిశీలనకు స్వతంత్ర విభాగం అవసరం కూడా దీనిలో భాగమే. ప్రతి కమ్యూనిటీ అవసరాలకు తగినట్లుగా సంస్కరణలను మార్చాలంటే స్థానిక కార్యకర్తలు, సంస్థలు పరిశోధనలు చేసి ఎలాంటి వ్యూహాలు చేపడితే ఉత్తమంగా ఉంటుంది అనే విషయంపై తోటి పౌరులను చైతన్యవంతం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రారంభ ఘట్టంగా, నేను వైట్‌హౌస్‌లో ఉన్నప్పుడు ఏర్పర్చిన ‘21వ శతాబ్ది విధానాలపై టాస్క్‌ఫోర్స్’ చేసిన కృషిపై ఆధారపడి పౌర, మానవ హక్కులపై లీడర్షిప్ కాన్ఫరెన్స్ అభివృద్ది చేసిన టూల్ కిట్, దానిగురించిన నివేదికను ముందుగా పరిశీ లించాలి. నిర్దిష్ట చర్యలు తీసుకోవడంపై మీకు శ్రద్ధాసక్తులు ఉంటే, ఒబామా ఫౌండేషన్‌లో ఒక నిబద్ధత కలిగిన సైట్‌ను రూపొందిం చాము. సంవత్సరాలుగా స్థానిక, జాతీయ స్థాయిల్లో మంచికోసం పోరాడుతూ వస్తున్న సంస్థలకు, వ్యక్తులకు ఇది ఉపయోగకరమైన వనరుగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా అమెరికా కఠిన పరిస్థితులను ఎదుర్కొందని, సమాజంలో స్ఫూర్తి కాస్త తగ్గుముఖం పట్టిందని నేను గుర్తిస్తున్నాను. కరోనా సాంక్రమిక వ్యాధి తీసుకొచ్చిన భయం, విషాదం, అనిశ్చితి, కష్టభూయిష్టమైన పరిస్థితులు వంటివి.. అమెరికా సామాజిక జీవితం ఇప్పటికీ దురభిప్రాయాలు, అసమానత్వంతో నిండివుందని విషాదకరంగా మనందరికీ గుర్తు తెస్తున్నాయి. కానీ గత కొన్ని వారాలుగా ప్రతి జాతిలో, ప్రతి ప్రాంతంలో మన యువతీయువకుల క్రియాశీలతను ఎత్తిపడుతున్న ఘటనలను చూస్తున్నప్పుడు మాత్రం నాకు పరిస్థితి పట్ల ఆశావహంగానే ఉంది. మనం ముందుకు పోవాలంటే మన ధర్మాగ్రహాన్ని శాంతిమార్గంవైపు మళ్లించాలి. నిలకడతో కూడిన సమర్థ కార్యాచరణను చేపట్టాలి. అప్పుడు మాత్రమే మన అత్యున్నత లక్ష్యాలకు అనుగుణంగా మన దేశం సాగించే సుదీర్ఘ ప్రయాణంలో ప్రస్తుత ఘట్టం నిజమైన మూలమలుపు అవుతుంది. బరాక్ ఒబామా, అమెరికా పూర్వ అధ్యక్షుడు -
కరోనా: మృతుల్లో నల్ల జాతీయులే అధికం
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ బారిన పడిన చనిపోతున్న వారిలో నల్లజాతీయులే అధికంగా ఉన్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్-19 బాధితుల్లో శ్వేత జాతీయులతో పోలిస్తే నల్లజాతీయులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్టు తేలింది. కరోనా పాజిటివ్ కేసుల్లో సగానికిపైగా నల్లజాతీయులు ఉన్నారని, మరణాల్లోనూ దాదాపు 60 శాతం మంది వీరేనని ఆంఫర్ అనే అమెరికా ఎయిడ్స్ పరిశోధన సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైనట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. సామాజిక-ఆర్థిక అంశాలే ఇందుకు కారణమని వివరించింది. ఆరోగ్య సంరక్షణ విషయంలో బాగా వెనుకబడి ఉంటడం కూడా ప్రధాన కారణమని పేర్కొంది. అధ్యయనంలో భాగంగా నల్లజాతీయుల జనాభా అధికంగా, తక్కువగా ఉన్న కౌంటీల్లోని కరోనా పాజిటివ్ కేసులు, మరణాలను పరిశీలించారు. (కరోనా: మూడో రోజుకు ఇలా అవుతుంది) దేశవ్యాప్తంగా నమోదైన గణాంకాలను పరిశీలిస్తే నల్లజాతీయుల జనాభా అధికంగా ఉన్న కౌంటీల్లో 52 శాతం మంది కరోనా బారిన పడగా, 58 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధ్యయకర్తలు గుర్తించారు. 3 వేలకు పైగా కౌంటీల్లో జనవరి నుంచి ఏప్రిల్ 13 వరకు ఉన్న సమాచారం ఆధారంగా ఈ అంచనాలకు వచ్చారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న కౌంటీల్లో నల్లజాతీయుల మరణాలు అధికంగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. నిరుద్యోగం, సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక నల్లజాతీయులు అధికంగా కరోనా బారినపడినట్టు పరిశోధకులు గుర్తించారు. నల్లజాతీయులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించకుంటే పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. చదవండి: ‘నమస్తే ట్రంప్’తో కరోనా వ్యాప్తి! -
ఓ ‘మహర్షి’ ఔదార్యం
వాషింగ్టన్ : ఎల్‌కేజీకే రూ లక్షల్లో ఫీజులు చెల్లించి ఆయా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి దిక్కులు చూస్తున్న క్రమంలో ప్రతిష్టాత్మక అమెరికన్ కాలేజ్‌లో విద్యార్ధుల రుణాలన్నీ చెల్లించేందుకు ఓ వ్యాపార దిగ్గజం ముందుకు రావడం అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. 440 కోట్ల డాలర్ల సంపద కలిగిన ఆఫ్రికన్ -అమెరికన్ వాణిజ్యవేత్త రాబర్ట్ ఎఫ్ స్మిత్ అట్లాంటాలోని బ్లాక్ మోర్హౌస్ కాలేజ్‌లో కొత్తగా డిగ్రీ పట్టా అందుకున్న విద్యార్ధుల రుణం మొత్తం ( దాదాపు రూ 250 కోట్లు) తాను చెల్లిస్తానని చెప్పి విద్యార్ధులు, తల్లితండ్రుల మన్ననలు పొందారు. విద్యార్ధుల రుణాన్ని చెల్లించేందుకు అవసరమైన నిధిని సమకూరుస్తానని స్మిత్ 400 మంది గ్రాడ్యుయేట్లు, వారి తల్లితండ్రుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. మీ విద్యార్ధుల రుణాన్ని మాఫీ చేసేలా తమ కుటుంబం నిధులు మంజూరు చేస్తుందని గ్రాడ్యుయేషన్ మీట్లో స్మిత్ పేర్కొన్నట్టు కాలేజ్ ట్విటర్ ఖాతా వెల్లడించింది. ఈ కాలేజ్ నుంచి స్మిత్ గౌరవ పట్టా పొందుతూ తన ఔదార్యం చాటారు. తనలాంటి ఎందరో బ్లాక్ అమెరికన్ల ఉన్నతికి తన సాయం భరోసా అందించాలనే సంకల్పమే ఈ ప్రకటనకు తనను పురిగొల్పిందని స్మిత్ చెప్పారు. -
అది నాకు పర్సనల్ అవమానమే!
వాషింగ్టన్: రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకుండా అడ్డుకోవాలని ఆఫ్రికన్-అమెరికన్లయిన నల్లజాతి ఓటర్లకు అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. నల్లజాతి ఓటర్లు రానున్న ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు ఓటువేయకపోతే అది వ్యక్తిగతంగా తనకు, తన వారసత్వానికి అవమానంగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు. శనివారం జరిగిన అమెరికా చట్టసభ (కాంగ్రెస్)లోని నల్లజాతి సభ్యుల సమావేశంలో అధ్యక్షుడిగా ఒబామా చివరి ప్రసంగం చేశారు. 'మా ఓటుకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎవరిని ఎన్నుకున్నా పెద్దగా తేడా ఉండదు అని ఎవరైనా అనుకుంటే.. ఓసారి మీ సొంత చరిత్రను చదవమనీ నేను సూచిస్తాను. ప్రతి ఒక్కరి ఓటు కీలకమైనదే. ప్రజలతో మనం ఓటు వేయించాలి' అని ఒబామా సూచించారు. 'ఈసారి ఎన్నికల్లో ఈ (నల్లజాతి) కమ్యూనిటీ చురుగ్గా వ్యవహరించి తన రక్షణలు పొందడంలో విఫలమైతే.. అది వ్యక్తిగతం నాకు, నా వారసత్వానికి అవమానంగా భావిస్తాను. నాకు ఘనమైన వీడ్కోలు చెప్పాలనుకుంటే వెళ్లి ఓటు వేయండి' ఒబామా సూచించారు. ఈ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పై పరుషమైన వ్యాఖ్యలతో ఒబామా విరుచుకుపడ్డారు. పౌరహక్కులపై దాడి చేసినవాడు, సమానత్వానికి వ్యతిరేకంగా పోట్లాడే వాడు, తన జీవితంలో ఎనాడూ కార్మికులను గౌరవించని వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అని మండిపడ్డారు. అమెరికాలోని నల్లజాతీయుల సంక్షేమం వారు తన పార్టీకి చెందిన డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి అండగా నిలువాల్సిందేనని ఒబామా స్పష్టం చేశారు.