అమెరికాలో ఆందోళనలు; ఒబామా స్పందన | Barack Obama Article on USA George Floyd Protests | Sakshi
Sakshi News home page

సమూల మార్పులకు సరైన తరుణం

Published Wed, Jun 3 2020 12:46 AM | Last Updated on Wed, Jun 3 2020 7:55 AM

Barack Obama Article on USA George Floyd Protests - Sakshi

జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు, సమాజంలో కొనసాగుతున్న అసమ న్యాయం సమస్యకు వ్యతిరేకంగా అమెరికాలో లక్షలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి గళమెత్తుతున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఎదుర్కొంటున్న ఈ సమస్యలో నిజమైన మార్పు తీసుకొచ్చేలా ఈ ఉద్వేగాలను ఎలా కొనసాగించాలి అని చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు. అంతిమంగా ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించేలా వ్యూహాలను తీర్చిదిద్దవలసిన బాధ్యత తదుపరి తరం కార్యకర్తల మీదే ఉంటుంది. అయితే గతంలో ఈ విషయంపై జరిగిన ప్రయత్నాలనుంచి గ్రహించవలసిన కొన్ని ప్రాథమిక పాఠాలు మనకు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.

మొదటగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెల్లువలా పెల్లుబుకుతున్న ప్రజా నిరసన కార్యక్రమాలు అనేవి.. పోలీసుల పనితీరులో, నేర న్యాయవ్యవస్థలో విస్తృత ప్రాతిపదికన సంస్కరణలు తీసుకురావడంలో అమెరికాలో దశాబ్దాలుగా సాగుతున్న వైఫల్యం పట్ల నిజమైన, సహేతుకమైన నిరాశా నిస్పృహలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారిలో చాలామంది శాంతియుతంగా, సాహసోపేతంగా, బాధ్యతాయుతంగా ఉంటూ స్ఫూర్తి కలిగిస్తున్నారు. కనుక వీరి నిరసనలను ఖండించడానికి బదులుగా మనందరం గౌరవించాలి. మద్ధతుగా నిలవాలి. నిజానికి కామ్‌డెన్, ఫ్లింట్‌ వంటి నగరాల్లోని  పోలీసులు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నందుకు వారిని ప్రశంసించాలి కూడా. 

మరోవైపున, అనేకరూపాల్లో హింసకు పాల్పడిన అతి చిన్న మైనారిటీ బృందాలు నిజమైన ఆగ్రహంతో లేక కేవల అవకాశవాదంతో అలా చేస్తున్నప్పటికీ అమాయకులను వీరు ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే తమ పొరుగున ఉన్న వారికి ఈ హింసాత్మక చర్యల ద్వారా కనీస సేవలు కూడా అందకుండా చేసేలా వీరి చర్యలు ఉంటున్నాయి. పైగా దీర్ఘకాలిక లక్ష్య సాధన నుంచి ఇలాంటి చర్యలు పక్కదోవ పట్టిస్తాయి. నిన్ననే కన్నీళ్లు పెట్టుకున్న ఒక నల్లజాతి మహిళ ఇంటర్వ్యూను చూశాను. తన పొరుగునే ఉన్న కిరాణా దుకాణాన్ని ధ్వంసం చేయడం ఆమెను విషాదంలో ముంచెత్తింది. నిజానికి ఆ దుకాణం మళ్లీ యథాస్థితికి వచ్చి సేవలందించాలంటే సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టే హింసను మనం సమర్థించవద్దు, దాన్ని హేతుబద్ధం చేయవద్దు లేక దాంట్లో పాల్గొనకుండా జాగ్రత్తపడదాం. మన నేర న్యాయవ్యవస్థ కానీ, అమెరికన్‌ సమాజం కానీ అత్యున్నత నైతిక నియమావళితో పనిచేయాలని మనం కోరుకుంటున్నట్లయితే అలాంటి నైతిక నియమావళిని ముందుగా మనం ఆచరించి చూపాల్సి ఉంది.

రెండో విషయం, మన నేరన్యాయ వ్యవస్థలో పదేపదే సాగుతున్న జాతివివక్షా ధోరణిని ఇలాంటి నిరసనలు, ప్రత్యక్ష పోరాటం మాత్రమే మార్చగలుగుతాయని.. ఓట్లు వేయడం, ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడం శుద్ధ దండగమారి వ్యవహారమని కొంతమంది సూచిస్తుండటాన్ని కూడా నేను విన్నాను. ఈ అభిప్రాయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాను. ప్రజల్లో జాగరూకత పెంచడం, అన్యాయాన్ని అక్కడికక్కడే ఎత్తి చూపడం, అధికారంలో ఉన్నవారికి అసౌకర్యం కలిగించడమే నిరసనల లక్ష్యంగా ఉండాలి. అమెరికా చరిత్ర పొడవునా ఇలాంటి ప్రజా నిరసనలు, సహాయ నిరాకరణకు స్పందించడం వల్లే, దేశంలోని రాజకీయ వ్యవస్థ అణగారిన బృందాల సమస్యల పట్ల ఆసక్తి చూపిందని గుర్తుంచుకోవాలి. కాబట్టే ప్రజల ఆకాంక్షలు, వారి ఉద్వేగాలు నిర్దిష్ట చట్టాలుగా, సంస్థాగత ఆచరణగా పరివర్తన చెందాయి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మన డిమాండ్ల పట్ల స్పందించేవారిని మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఇది సాకారమవుతుంది.

అంతకంటే మించి, మన నేరన్యాయ వ్యవస్థపై, పోలీసుల పనితీరుపై ఎలాంటి ప్రభుత్వం అత్యధిక ప్రభావం వేయగలుగుతుందో మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం రాజకీయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనలో చాలామంది అధ్యక్షుడు, ఫెడరల్‌ ప్రభుత్వం పట్ల మాత్రమే ఆసక్తి పెంచుకుంటూ ఉంటారు. నిజమే. మన సమాజంలో జాతి వివక్ష పాటిస్తున్న అణచివేత స్వభావాన్ని వాస్తవంగానే అర్థం చేసుకుని దానిపై ఏదో ఒక చర్య తీసుకోవాలంటే.. అధ్యక్షుడు, కాంగ్రెస్, అమెరికన్‌ న్యాయ విభాగం, ఫెడరల్‌ న్యాయవ్యవస్థ మనకు తప్పకుండా ఉండితీరాలి. అయితే రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో ఎన్నికైనవారే చాలావరకు పోలీసు శాఖలో, నేరన్యాయవ్యవస్థలో సంస్కరణల గురించి చాలా ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారని మాత్రం మర్చిపోవద్దు.

చాలావరకు పోలీసువిభాగం అధిపతులను మేయర్లు, కౌంటీ కార్యనిర్వాహకులే ఎక్కువగా నియమిస్తుంటారు, పోలీసు యూనియన్లతో సమష్టి ఒప్పందాలపై చర్చిస్తుంటారు. పోలీసుల దుష్ప్రవర్తనపై విచారించాలా వద్దా, అంతిమంగా వారిపై నేరారోపణ చేయాలా వద్దా వంటి విధులను జిల్లా అటార్నీలు, రాష్ట్రాల అటార్నీలు నిర్వహిస్తుంటారు. వీరంతా ఎన్నికైనవారే. కొన్ని చోట్ల పోలీసుల వ్యవహార శైలిని పర్యవేక్షించే అధికారాన్ని పోలీసు సమీక్షా మండళ్లకు ఉంటుంది. కానీ ఈ స్థానిక పోటీల్లో పాల్గొనే ఓటర్ల సంఖ్య.. ప్రత్యేకించి యువతీయువకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్యలపై నేరుగా ప్రభావం చూపే ఇలాంటి పదవులను పట్టించుకోకపోవడం తెలివిలేని పని. పైగా.. ఈ కీలకమైన స్థానాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే అంశాన్ని కొన్ని వేలమంది ఓటర్లు లేక కొన్ని వందలమంది ఓటర్లు మాత్రమే నిర్ణయిస్తుంటారు.

కాబట్టి నిజమైన మార్పు తీసుకురావాలని మనం కోరుకుంటున్నట్లయితే, అలాంటి అవకాశం నిరసనలు లేక రాజకీయాల్లో ఏదో ఒకదానిపై ఆధారపడి ఉండదు. ఈ రెండూ మనకు కావాలి. ప్రజల్లో జాగరూకతను పెంచడానికి మనం జనాల్ని కూడగట్టాలి. పాలనా సంస్కరణలు తీసుకురాగల అభ్యర్థులను మాత్రమే మనం ఎన్నుకునేలా మన ఓటుహక్కును వినియోగించుకునేలా మనం సంఘటితం కావాలి. చివరగా నేర న్యాయవ్యవస్థలో, పోలీసు విభాగంలో సంస్కరణలపై మనం నిర్దిష్టంగా డిమాండ్లు పెట్టాలి, దీన్ని ముందుకు తీసుకురానట్లయితే ఎన్నికైనవారు ఈ కీలకమైన సంస్కరణ పట్ల నామమాత్రంగా మాత్రమే స్పందిస్తూ, ప్రజా నిరసనలు తగ్గుముఖం పట్టాక యధావిధిగా తమ తమ రోజువారీ పనుల్లో మునిగిపోతారు.

కాబట్టి సంస్కరణల ఎజెండా విషయం వివిధ సామాజిక బృందాలకు సంబంధించినంతవరకూ వేరువేరుగా ఉంటుంది. మహానగరం విషయంలో ఒక తరహా సంస్కరణలు అవసరం కావచ్చు. గ్రామీణ ప్రజానీకానికి మరో తరహా సంస్కరణలు అవసరం కావచ్చు. కొన్ని ప్రాంతాలకు పూర్తిగా పునరావాసం అవసరం కావచ్చు. ఇతరులకు కొన్ని సంస్కరణలే అవసరం కావచ్చు. అందుకే ప్రతి శాసన అమలు విభాగం కూడా స్పష్టమైన విధానాలు కలిగి ఉండాలి. ఎక్కడైనా దుష్ప్రవర్తనకు సంబంధించిన పరిశీలనకు స్వతంత్ర విభాగం అవసరం కూడా దీనిలో భాగమే. ప్రతి కమ్యూనిటీ అవసరాలకు తగినట్లుగా సంస్కరణలను మార్చాలంటే స్థానిక కార్యకర్తలు, సంస్థలు పరిశోధనలు చేసి ఎలాంటి వ్యూహాలు చేపడితే ఉత్తమంగా ఉంటుంది అనే విషయంపై తోటి పౌరులను చైతన్యవంతం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రారంభ ఘట్టంగా, నేను వైట్‌హౌస్‌లో ఉన్నప్పుడు ఏర్పర్చిన ‘21వ శతాబ్ది విధానాలపై టాస్క్‌ఫోర్స్‌’ చేసిన కృషిపై ఆధారపడి పౌర, మానవ హక్కులపై లీడర్‌షిప్‌ కాన్ఫరెన్స్‌ అభివృద్ది చేసిన టూల్‌ కిట్, దానిగురించిన నివేదికను ముందుగా పరిశీ లించాలి. నిర్దిష్ట చర్యలు తీసుకోవడంపై మీకు శ్రద్ధాసక్తులు ఉంటే, ఒబామా ఫౌండేషన్‌లో ఒక నిబద్ధత కలిగిన సైట్‌ను రూపొందిం చాము. సంవత్సరాలుగా స్థానిక, జాతీయ స్థాయిల్లో మంచికోసం పోరాడుతూ వస్తున్న సంస్థలకు, వ్యక్తులకు ఇది ఉపయోగకరమైన వనరుగా ఉంటుంది. 

గత కొన్ని నెలలుగా అమెరికా కఠిన పరిస్థితులను ఎదుర్కొందని, సమాజంలో స్ఫూర్తి కాస్త తగ్గుముఖం పట్టిందని నేను గుర్తిస్తున్నాను. కరోనా సాంక్రమిక వ్యాధి తీసుకొచ్చిన భయం, విషాదం, అనిశ్చితి, కష్టభూయిష్టమైన పరిస్థితులు వంటివి.. అమెరికా సామాజిక జీవితం ఇప్పటికీ దురభిప్రాయాలు, అసమానత్వంతో నిండివుందని విషాదకరంగా మనందరికీ గుర్తు తెస్తున్నాయి. కానీ గత కొన్ని వారాలుగా ప్రతి జాతిలో, ప్రతి ప్రాంతంలో మన యువతీయువకుల క్రియాశీలతను ఎత్తిపడుతున్న ఘటనలను చూస్తున్నప్పుడు మాత్రం నాకు పరిస్థితి పట్ల ఆశావహంగానే ఉంది. మనం ముందుకు పోవాలంటే మన ధర్మాగ్రహాన్ని శాంతిమార్గంవైపు మళ్లించాలి. నిలకడతో కూడిన సమర్థ కార్యాచరణను చేపట్టాలి. అప్పుడు మాత్రమే మన అత్యున్నత లక్ష్యాలకు అనుగుణంగా మన దేశం సాగించే సుదీర్ఘ ప్రయాణంలో ప్రస్తుత ఘట్టం నిజమైన మూలమలుపు అవుతుంది.

బరాక్‌ ఒబామా, అమెరికా పూర్వ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement