
ఎలుగుబంటితో తలపడిన పెంపుడు కుక్క
ఎలుగుబంటి దాడి నుంచి ఆరేళ్ల బాలుడిని కాపాడిన ఓ పెంపుడు కుక్క ఉత్తర జపాన్ లో పతాక శీర్షికలకు ఎక్కింది.
టోక్యో: ఎలుగుబంటి దాడి నుంచి ఆరేళ్ల బాలుడిని కాపాడిన ఓ పెంపుడు కుక్క ఉత్తర జపాన్ లో పతాక శీర్షికలకు ఎక్కింది. పోలీసులు, మీడియా దాన్ని హీరోగా కీర్తించాయి. షిబా ఇను అనే ఆరేళ్ల బాలుడు తన 80 ఏళ్ల ముత్తాతతో కలిసి శనివారం సాయంత్రం ఒడేట్ లో నది ఒడ్డుకు వాకింగ్ కు వెళ్లాడు. ఇదే సమయంలో మూడగులు ఎత్తున్న అడవి ఎలుగుబంటి ఒక్కసారిగా షిబాపై దాడి చేసింది.
షిబా ముత్తాత భయంతో కారు దగ్గరకు పరుగులు తీశాడు. అయితే అక్కడే వున్న ఆయన పెంపుడు కుక్క గట్టిగా మొరుగుతూ, ఎలుగుబంటి వెంటపడింది. దీంతో ఎలుగుబంటి తోక ముడించింది. ఈ ఘటనలో షిబాకు స్వల్ప గాయాలయ్యాయని, చికిత్స అనంతరం అతడికి ఇంటికి పంపించినట్టు పోలీసులు తెలిపారు. సాహసం చేసిన కుక్క పేరు మెగో(క్యూట్) అని వెల్లడయింది. ఎప్పుడూ మౌనంగా, భయంగా ఉండే మెగో ఎలుగుబంటిని తరిమికొట్టడం పట్ల షిబా ముత్తాత అమితాశ్చర్యం వ్యక్తం చేశాడు.