మా ఆయనకు అమ్మాయిల పిచ్చి!
షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితుడు పీటర్ ముఖర్జియా విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని కూడా అతడి మాజీ భార్య షబ్నమ్ సింగ్ తెలిపారు. పీటర్ ముఖర్జియాకు వయసులో ఉన్న అమ్మాయిలంటే పిచ్చి అని ఆమె చెప్పారు. ‘‘పీటర్కు అసలు నైతిక విలువలు అనేవి లేవు. అతడి చుట్టూ ఎప్పుడూ వయసులో ఉన్న అమ్మాయిలు ఉండాల్సిందే. లేట్ నైట్ పార్టీలంటే అతడికి చాలా ఇష్టం. అతడి జీవితంలో చాలామంది మహిళలున్నారు. అసలు అందుకే నేను విడాకులు తీసుకున్నాను’’ అని ఆమె పోలీసు విచారణలో వెల్లడించారు. ఆమె చాలా కాలం క్రితమే ఈ విషయాలను సీబీఐకి చెప్పినా, ఇన్నాళ్ల పాటు ఆ ప్రకటన కాపీలను రహస్యంగా ఉంచారు. వాటిని ఇటీవలే పీటర్ తరఫు న్యాయవాది మిహిర్ ఘీవాలాకు, ఇంద్రాణి ముఖర్జియా తరఫు న్యాయవాది గంజన్ మంగ్లాకు అప్పగించారు.
కాగా, షబ్నమ్ సింగ్ వెల్లడించిన విషయాల్లో ఈ కేసుకు సంబంధం లేని మరో అంశం కూడా ఉంది. అయితే.. ఆ విషయం బయటకు వస్తే సంబంధిత వ్యక్తి పరువు ప్రతిష్ఠలు మంటగలుస్తాయని అంటున్నారు. పీటర్ గురించి సంచలన విషయాలు వెల్లడించడంతో షబ్నమ్ సింగ్కు భద్రత కల్పించాలని ప్రత్యేక కోర్టు జడ్జి హెచ్ఎస్ మహాజన్ ఆదేశించారు. తాను ఇంగ్లండ్లో ఉన్నప్పుడు.. పీటర్ తన ఇంటికి వస్తానన్నాడని, అప్పుడు వేరే అమ్మాయితో వచ్చాడని ఆమె చెప్పారు. ఆ వచ్చిన మహిళను తన గర్ల్ఫ్రెండ్గా పరిచయం చేశాడని.. ఆమె పేరు ఇంద్రాణి అని తన వాంగ్మూలంలో తెలిపారు. అప్పుడే ‘నువ్వు బాగుపడవు’ అని పీటర్తో అన్నానన్నారు. ఇంద్రాణి గత చరిత్ర గురించి తెలిసి కూడా పీటర్ ఆమెను పెళ్లి చేసుకున్నట్లు ఆ తర్వాత తెలిసిందని చెప్పారు.