
క్యాష్‌లెస్‌పై ‘పెట్రో’వార్
బంకులు, బ్యాంకుల ఎండీఆర్ చార్జీల లొల్లి
♦ తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డీలర్లు
♦ సోమవారం నుంచి బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డు చెల్లింపులు బంద్ చేస్తున్నట్టు ప్రకటన
♦ తర్వాత 13వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్టు వెల్లడి
♦ జనరల్, మెడికల్ షాపుల్లోనూ వినియోగదారులు, వ్యాపారులపై సర్‌చార్జి మోత
♦ మళ్లీ నగదు వైపే చూస్తున్న జనం
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్:
బంకుల్లో నగదు రహిత లావాదేవీలపై ‘పెట్రో’వార్ మొదలైంది! పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీల వసూలు బ్యాంకులు, బంకుల మధ్య చిచ్చు రేపింది. ఈ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించబోమంటూ ఆదివారం ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బాంబు పేల్చింది. అయితే ఉన్నట్టుండి అర్ధరాత్రి తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెల 13 వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు అఖిల భారత పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్ వెల్లడించారు.
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించేందుకు.. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై వినియోగదారుల నుంచి ఎండీఆర్ చార్జీలు వసూలు చేయడాన్ని కేంద్రం ఎత్తివేసింది. అయితే 50 రోజుల గడువు ముగియడంతో ఆ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా పెట్రోల్ బంకుల యాజమాన్యాల నుంచి వసూలు చేయాలంటూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ‘‘పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు లావాదేవీలపై 1 శాతం పన్ను, డెబిట్ కార్డులపై 0.25 శాతం నుంచి 1 శాతం పన్నును జనవరి 9 నుంచి వసూలు చేస్తాం’’అంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి తమకు లేఖ వచ్చిందని అజయ్ బన్సాల్ తెలిపారు. డిసెంబర్ 16న రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన సరŠుక్యలర్ మేరకే నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొందని వివరించారు. ఈ చార్జీల వసూలును నిరసిస్తూ సోమవారం నుంచి బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డులను అంగీకరించవద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఆ చార్జీల వసూలును 13 వరకు వాయిదా వేస్తున్నట్లు చమురు కంపెనీల నుంచి సమాచారం అందడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు చెప్పారు.
జనరల్, కిరాణా షాపుల్లో సర్‘చార్జ్’
క్యాష్‌లెస్ చెల్లింపుల ప్రక్రియతో అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారులపై సర్‌చార్జీ భారం పడుతోంది. డెబిట్/క్రెడిట్ కార్డు వాడుతున్న వినియోగదారుడి ప్రతి లావాదేవీపై సగటున 2.8 శాతం సర్‌చార్జీ పడుతోంది. స్వైపింగ్ మిషన్ ద్వారా చెల్లించిన మొత్తానికి మాత్రమే మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వస్తోంది. సర్‌చార్జీ పేరిట కోత పడుతున్న డబ్బులకు సంబంధించి ఎలాంటి మెసేజ్ రావడం లేదు. జనవరి 1 నుంచే ఈ వాత అమల్లోకి వచ్చింది. మరోవైపు పీఓఎస్ మెషీన్లతో లావాదేవీలు సాగిస్తున్న వ్యాపారులపైన 2 శాతం భారం పడుతోంది.
దీంతో జనరల్, కిరాణా సోర్లు, మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన మొత్తంపై 2 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఎల్బీనగర్‌కు చెందిన రవికుమార్ ఆదివారం ఓ మెడికల్‌షాపులో రూ.165 మెడిసిన్ కొనుగోలు చేయగా.. షాప్‌కీపర్ మాత్రం స్వైపింగ్ మిషన్లో రూ.169 ఎంట్రీ చేసి బిల్లు తీసుకున్నాడు. అదేంటని అడిగితే.. తమకు ప్రతి కొనుగోలుపై సర్‌చార్జీ పడుతోందని, అందుకే రూ.4 అదనంగా తీసుకుంటున్నట్టు చెప్పాడు. ఇది వినియోగదారులకు, వ్యాపారులకు భారంగా మారుతుండడంతో మళ్లీ నగదు లావాదేవీల వైపే మొగ్గుతున్నారు.
కారులో రూ.1,200 పెట్రోలు కొట్టించా. నగదుకు బదులుగా డెబిట్‌కార్డుతో డబ్బులు చెల్లించా. బ్యాంకు ఖాతా నుంచి రూ.1,200తో పాటు సర్వీసు చార్జీ పేరిట అదనంగా రూ.34 కోత పడింది. మినీ స్టేట్‌మెంట్ తీసుకుంటే ఈ విషయం తెలిసింది. ఇట్లా సర్‌చార్జీ పడితే మళ్లీ కార్డు ఉపయోగించ.
– కొట్ర బలరాం, నాగర్‌కర్నూల్
క్యాష్‌లెస్ పద్ధతిలో రోజుకు సగటున రూ.2 లక్షల రాబడి వస్తుండగా.. బ్యాంకు ఖాతాలో మాత్రం రూ.1.95 లక్షలు మాత్రమే జమవుతున్నట్లు స్టేట్‌మెంట్‌లో కనిపిస్తోంది. వారం రోజుల్లో దాదాపు రూ.40 వేలు కోత పడింది. కార్డుల ద్వారా చెల్లింపులతో ఇలా కోత పడితే వాటిని వినియోగించడం కష్టం కదా..
– హనుమంతు, పెట్రోల్ క్ క్యాషియర్, ఇబ్రహీంపట్నం