పెట్రోలు బంకు మాయమైపోయింది! | petrol pump vanishes just before police raid in lucknow | Sakshi
Sakshi News home page

పెట్రోలు బంకు మాయమైపోయింది!

Published Tue, May 2 2017 8:32 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

పెట్రోలు బంకు మాయమైపోయింది! - Sakshi

పెట్రోలు బంకు మాయమైపోయింది!

పెట్రోలు బంకులు యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారని వాళ్ల మీద దాడులు చేస్తుంటే.. దాడి విషయాన్ని కొద్ది నిమిషాల ముందుగా తెలుసుకున్న ఓ యజమాని.. ఏకంగా పెట్రోలు పోసే మిషన్‌నే తీసి దాచేశారు! అలా తన బంకునే ఆయన మాయం చేశారు. బంకు పునర్నిర్మాణంలో ఉందంటూ బోర్డు పెట్టి.. దాడి నుంచి తప్పించుకోవాలని చూశారు. అయితే తలదన్నేవాడుంటే తాడి తన్నేవాడు ఉంటాడన్నట్లు.. అతగాడి పప్పులు అధికారుల దగ్గర ఉడకలేదు. ఇలాంటి 'పునర్నిర్మాణంలో ఉన్న' పలు బంకులమీద కూడా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. వాళ్లు దాచిపెట్టిన మిషన్లను బయటకు తీయించి మరీ వాటిని తనిఖీ చేశారు.

ఆయా మిషన్లలో చిప్‌లు పెట్టిన విషయాన్ని గుర్తించి, వాటిని వెంటనే తీసి పారేయించారు. వినియోగదారులను మోసం చేయడానికి వీలుగా పెట్రోలు బంకుల్లో ఇలాంటి చిప్‌లు పెట్టి, పైకి తగినంత పోసినట్లు చూపిస్తూనే అందులో కోత పెడుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా యూపీ పోలీసులు చేస్తున్న దాడుల్లో ఇలాంటివి దాదాపు వెయ్యి వరకు చిప్‌లు బయటపడ్డాయి. వీటి ద్వారా రోజుకు రూ. 15 లక్షల విలువైన పెట్రోలును బంకుల యాజమాన్యాలు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. యూపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6వేల పెట్రోలు బంకులుంటే అన్నింటిమీదా దాడులు జరగబోతున్నాయి. ఇప్పటివరకు 9 పెట్రోలు బంకులను సీల్ చేసి, 23 మందిని అరెస్టు చేశామని, వారిలో నలుగురు యజమానులు కూడా ఉన్నారని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. ప్రతి లీటరుకు 100 మిల్లీలీటర్లు తక్కువగా పోస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement