
బావిలో పెట్రోల్.. తోడుకునేందుకు జనాల పోటీ!
అనగనగా ఓ పురాతన బావి ఉంది. ఆ బావిలో నీళ్లు ఉంటాయని భావించి బొక్కెన వేసి తోడారు స్థానికులు. కానీ ఆ బావిలో నీళ్లకు బదులు పెట్రోల్ లాంటి చమురు లభించింది. అంతే ఆ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకిపోయింది. స్థానికులు పెద్ద సంఖ్యలో బకెట్లు, బిందెలు వేసుకొని బావి చుట్టూ మూగారు. తమ వాటా చమురు కోసం పోటీపడ్డారు. ఈ ఘటన బిహార్‌లోని గయా నగరంలో చోటుచేసుకుంది.
ఓ బావిలో పెట్రోల్ లాంటి చమురు లభిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. దీంతో పెద్దసంఖ్యలో జనం ఆ చమురును సొంతం చేసుకోవడానికి పోటీపడ్డారు. ఈ సమాచారం తెలియడంతో బిహార్ ప్రభుత్వం కూడా స్పందించింది. బావిలో పెట్రోల్ తరహా చమురు లభిస్తున్నట్టు తెలిసిందని, దీంతో బావిని స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్‌ఐ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఈ బావిని పరిశీలించడానికి త్వరలోనే ఓ నిపుణుల బృందం రానుందని ఆయన చెప్పారు.