స్టాక్స్‌లోకి పీఎఫ్ నిధులు..!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు, ఈక్విటీ సంబంధిత పథకాల్లోకి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) నిధులను మళ్లించడం దాదాపు ఖాయమయినట్లు కనబడుతోంది. మొదట మొత్తం నిధుల్లో ఒక శాతాన్ని ఈక్విటీ మార్కెట్లు, ఆయా స్కీమ్‌లలోకి మళ్లించి, అటు తర్వాత ఈ పెట్టుబడులను 5 శాతం వరకూ పెంచాలన్నది కార్మిక మంత్రిత్వశాఖ ప్రతిపాదనని సీనియర్ అధికారులు తెలియజేస్తున్నారు. తరువాతి క్రమంలో ఎప్పటికప్పుడు సమీక్ష, తదనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. త్వరలో ఈ అంశంపై విధివిధానాలను ఆవిష్కరించనున్నట్లు కూడా అధికారులు తెలిపారు. మంగళవారం నాడు ఇక్కడ ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ ట్రస్టీల బోర్డ్ సమావేశమై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్‌లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952 సమగ్ర సవరణలపై చర్చలు జరిపింది. ఈ సందర్భంగా సీనియర్ అధికారులు కొందరు విలేకరులకు ఈ అంశాలు తెలిపారు.
అందరి అభిప్రాయాలమేరకే: దత్తాత్రేయ
ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ దాదాపు 5 కోట్ల మంది చందాదారులతో దాదాపు రూ.6.5 లక్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది. 2015-16 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా కనీసం 5% వరకూ ఈపీఎఫ్‌ఓ నిధులను ఈక్విటీ, సంబంధిత పథకాల్లో పెట్టుబడులను ప్రతిపాదించారు. గరిష్టంగా 15% వరకూ ఈ నిధులు ఉండవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా అనుభవాలను చూస్తే... ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల అధిక లాభాలు వస్తాయన్న విషయం రుజువవుతోందని కార్మిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కాగా మంగళవారం సమావేశం అనంతరం కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే ఈపీఎఫ్‌ఓ నిధుల పెట్టుబడులపై కేంద్ర నిర్ణయం ఉంటుందని