
ఫార్మా షేర్లకు అమెరికా విచారణ దెబ్బ
ఒకవైపు అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఎన్నికలు దేశీయ స్టాక్ మార్కెట్లను ఊగిసలాటలోకి నెట్టేస్తే.. అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు వార్తలతో ఫార్మా సెక్టార్ లో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫార్మా ఇండెక్స్ దాదాపు 4.69 శాతం పతనమైంది. దీంతో దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా సన్ పార్మా టాప్ లూజర్ గా ఉండగా, గ్లెన్‌మార్క్, అరబిందో 5 శాతం చొప్పున డాక్టర్ రెడ్డీస్ 4.5 శాతం పతమైనంది ఈ బాటలో లుపిన్, క్యాడిలా, సనోఫీ, దివీస్ లేబ్, సిప్లా, గ్లాక్సో, పిరామల్ 4-2 శాతం నష్టాల్లో ఉన్నాయి. ఈ కంపెనీలు జట్టుకట్టడం ద్వారా పలు ఔషధాలకు అధిక ధరలను వసూలు చేస్తున్నాయన్న అంశంపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తు నిర్వహిస్తోందని, ఈ ఏడాది చివరికల్లా పలు కంపెనీలపై చర్యలకు అవకాశమున్నదన్న వార్తలు వెలువడ్డాయి. దీంతో మైలాన్, తేవా ఫార్మా తదితర కంపెనీల షేర్లు అమెరికా మార్కెట్లో గురువారమే పతనమయ్యాయి.
జెనెరిక్ ఔషధ కంపెనీలు వసూలు చేస్తున్న అధిక ధరల వ్యవహారంపై ఫెడరల్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేషన్ విచారణ చేపట్టాలని అమెరికా చట్ట ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇందులో మొదటిది మార్టిన్ షెక్రిల్ కు చెందిన యాంటి ప్లాస్టిక్ మందు ధరనుభారీగా పెంచిందన్న ఆరోపణలు, రెండవది మైలాన్ ఫార్మాస్యూటికల్ కు చెందిన ఎలర్జీ ఇంజెక్షన్ ఎపిపెన్ ధరను భారీగా పెంచారన్న ఆరోపణ ఈ రెండు కేసులపై ఒకేసారి క్రిమినల్ విచారణ జరగనుందన్న షాక్ దేశీయ ఫార్మా కంపెనీలకు భారీగా తాకింది.
ఈ వార్తలపై డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధులు స్పందించారు. ఏడాదిన్నర క్రితమే దీనికిసంబంధించిన నోటీసులు తమకు అందాయని చెప్పారు. అలాగే తమ స్పందనను తెలియజేశామన్న వారు ప్రస్తుత కొత్త పరిణామాల సమాచారం తమకు చేరలేదని స్పష్టం చేశారు. విచారణలో ఉన్న ఈ అంశంపై ఇంతకుమించి వ్యాఖ్యానించడానికి మాత్రం నిరాకరించారు. కాగా కంపెనీలతో ఒప్పందాలు, ప్రత్యక్ష మార్కెటింగ్ ద్వారా దేశీ కంపెనీలు కూడా అమెరికా మార్కెట్లో పలు జనరిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.