వెలుగులో ఫార్మా, సిమెంట్ షేర్లు...
డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనున్న నేపథ్యంలో మంగళవారం ప్రధాన సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 68 పాయింట్ల స్వల్పనష్టంతో 21,033 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 6,268 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఫార్మా, సిమెంటు షేర్లు ర్యాలీ జరపగా, పవర్, మెటల్ షేర్లు నష్టపోయాయి. ఢిల్లీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఆమ్‌ఆద్మీ పార్టీ విద్యుత్ టారీఫ్‌లు సగానికి తగ్గిస్తామని చెప్పడంతో టాటా పవర్ షేరు 3 శాతం నష్టపోయింది. ఈ కంపెనీ అక్కడ విద్యుత్ పంపిణీ చేసే సంస్థల్లో ఒకటి.
హిందుస్థాన్ జింక్ డిజిన్వెస్ట్‌మెంట్ వ్యవహారంలో వేదాంతా గ్రూప్‌పై సీబీఐ ప్రాధమిక విచారణ చేపట్టిందన్న వార్తలతో సేసా స్టెరిలైట్ 2 శాతంపైగా తగ్గింది. బుధవారం మార్కెట్‌కు సెలవు అయినందున, డిసెంబర్ డెరివేటివ్ సిరీస్‌కు ఒక్కరోజే గడువు వుందని, దాంతో చాలావరకూ స్క్వేర్‌అఫ్, రోలోవర్ యాక్టివిటీ కొనసాగిందని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. క్రిస్మస్ సెలవుల కారణంగా సంస్థాగత ఇన్వెస్టర్ల కార్యకలాపాలు మందగించాయి. ప్రధాన సూచీలు క్షీణించినా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో వరుసగా మూడోరోజు కొనుగోళ్లు కొనసాగాయి. చిన్న షేర్ల ర్యాలీ ఫలితంగా బీఎస్‌ఈలో మొత్తం ట్రేడయిన షేర్లలో పెరిగినవే ఎక్కువ. 1,444 షేర్లు పెరగ్గా, 1,034 షేర్లు తగ్గాయి. డెరివేటివ్ విభాగంలో ట్రేడయ్యే మిడ్‌క్యాప్ షేర్లు సెంచురీ టెక్స్‌టైల్స్ 13 శాతం, అపోలో టైర్స్ 8 శాతం చొప్పున ఎగిసాయి. కూపర్‌టైర్స్ టేకోవర్ వ్యవహారంలో అమెరికా కోర్టు తీర్పు అపోలోటైర్స్‌కు అనుకూలంగా రావడంతో ఈ షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ జరిపింది.