ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రుల హాజరు
కార్యక్రమానికి హాజరైన వారిలో అమిత్‌షా, అద్వానీ
ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నివాసంలో మంగళవారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుగా కొనసాగిన ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనాయకులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రూపంలో చేసుకుంటారన్నారు. ‘సంక్రాంతి అనేది ప్రకృతి పండుగ. సూర్యుడి గమనాన్ని అనుసరించి చేసుకునేది. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరాలన్న సందేశాన్ని ఇచ్చేది సంక్రాంతి. ఈ సందర్భంగా ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.
వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్, ఉమాభారతి, ధర్మేంద్రప్రధాన్, బండారు దత్తాత్రేయ, అశోక్‌గజపతిరాజు, హర్షవర్ధన్, అనంతకుమార్, రాంవిలాస్ పాశ్వాన్, నరేంద్రసింగ్ థోమర్, జితేందర్ సింగ్, నజ్మాహెప్తుల్లా, డిప్యూటీ స్పీకర్ తంబిదొరై, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్, కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మ, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, మాడ్గుల నాగఫణిశర్మ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తోపాటు పలువురు బీజేపీ ఎంపీలు, ఢిల్లీ బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అచ్చమైన తెలుగు వంటకాలతో ఇచ్చిన తేనీటి విందును ఆస్వాదించారు. వెంకయ్య ఢిల్లీకి వచ్చినప్పటి నుంచి ఆయన ఇంట్లో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో ఏటా పాల్గొంటున్నానని అద్వానీ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమా లు ఆహూతులను అలరించాయి.
అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి..
సమాజంలోని అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందాలని, కొత్త ఏడాది అందరికీ శుభం తెస్తుందని వెంకయ్య ఆకాంక్షించారు. తెలంగాణ, ఏపీలోని తెలుగువారితోపాటు దేశంలోని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాం క్షలు తెలిపారు. ‘దేశంలో అభివృద్ధి పర్వం మొదలైంది. 2015 ఏడాదిలో అభివృద్ధి ఫలా లు అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాల వారికీ చేరుకోవాలని కోరుకుంటున్నా’ అన్నారు.
వెంకయ్య ఇంట సంక్రాంతి సంబరం
Published Wed, Jan 14 2015 1:36 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement