27న ఫేస్‌బుక్ ఆఫీసుకు మోదీ
గూగుల్ ప్రధాన కార్యాలయాన్నీ సందర్శించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల చివరి వారంలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఫేస్‌బుక్ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఆహ్వానం మేరకు మోదీ ఈనెల 27న కాలిఫోర్నియాలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. ఒక దేశ ప్రధాని ఫేస్‌బుక్ ఆఫీసును సందర్శించనుండడం ఇదే ప్రథమం.
ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగులతో ముఖాముఖీ భేటీ ఏర్పాటు చేశారు. ప్రసంగం అనంతరం ప్రధాని ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. మోదీ ఈనెల 23 నుంచి 29వ తేదీవరకు ఐర్లాండ్, అమెరికాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ప్రసంగించడంతోపాటు, అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయాన్నికూడా సందర్శిస్తారు.
ఇదిలా ఉంటే ‘ఈనెలాఖరులో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయానికి రానున్నారు, ఆయన రాక ఎంతో ఉత్కంఠ కలిగిస్తోంది. సామాజిక, ఆర్థిక సమస్యలను, సవాళ్లను ఎలా ఎదుర్కొనాలి.. వివిధ వర్గాలను ఇందుకోసం ఎలా ఒక్కటిగా చేయాలి అనే అంశాలపై మోదీతో చర్చించబోతున్నా’ అని జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకున్నారు. కాగా, ప్రధాని కూడా తనను అడగబోయే ప్రశ్నలను కోరుతూ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. ఫేస్‌బుక్ కార్యాలయానికి తనను ఆహ్వానించినందుకు జుకర్‌బర్గ్‌కు ధన్యవాదాలు తెలిపారు.