భారత్ రానున్న ఫేస్‌బుక్ మార్క్ జుకర్‌బెర్గ్
న్యూఢిల్లీ: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బెర్గ్ ఈ నెలలో భారత్‌కు రానున్నారు. ఇక్కడ ఈ నెల 9-10 తేదీల్లో జరిగే తొలి ఇంటర్నెట్‌డాట్‌ఓఆర్‌జీ సమావేశంలో పాల్గొనడానికి ఆయన వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కీలకమైన మంత్రులను కూడా ఆయన కలుస్తారని సమాచారం.
కొద్ది రోజుల వ్యవధిలోనే అమెరికాకు చెందిన పెద్ద కార్పొరేట్ సంస్థల అధినేతలు భారత్‌ను సందర్శించడం విశేషం. అమెజాన్ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల తర్వాత ఫేస్‌బుక్ మార్క్ జుకర్‌బెర్గ్ రానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యాక్సెస్‌ను చౌకధరలో అందించడం లక్ష్యంగా పనిచేస్తున్న ఇంటర్నెట్‌డాట్‌ఓఆర్‌జీకు ఫేస్‌బుక్, ఎరిక్సన్, మీడియాటెక్, నోకియా, ఒపెరా, క్వాల్‌కామ్. శామ్‌సంగ్‌లు వ్యవస్థాపక సభ్యులుగా వ్యవహరిస్తున్నాయి.
ఈ ఏడాది జూలైలో ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శాండ్‌బెర్గ్ భారత్‌ను సందర్శించారు. ఆమె ప్రధాని మోదీని కూడా కలిశారు. ఫేస్‌బుక్‌కు భారత్ రెండో అతి పెద్ద మార్కెట్. భారత్‌లో ఫేస్‌బుక్‌కు 10 కోట్ల మంది యూజర్లున్నారని అంచనా.