క్యాష్ బ్యాన్: పవర్ కంపెనీలకు బంపర్ బొనాంజ
క్యాష్ బ్యాన్: పవర్ కంపెనీలకు బంపర్ బొనాంజ
Published Wed, Nov 23 2016 4:37 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల బ్లాక్మనీ ఎంతవరకు బయటికి వస్తుందే ఏమో కాని, కొండలా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు మాత్రం బయటికి వచ్చేస్తున్నాయి. దీంతో సంక్షోభంలో ఉన్న పవర్ కంపెనీలకు బాగానే లబ్ది చేకూరుతుందట. నవంబర్ 24వరకు పెండింగ్లో ఉన్న కరెంట్ బిల్లులను పాత నోట్లతో కట్టుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో, ఇన్నిరోజులు బిల్లులను కట్టకుండా ఎగ్గొట్టిన విద్యుత్ వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసుల ముందు బారులు తీరుతున్నారు.
పాత నోట్లను రద్దు చేశాక, ఊహించని రీతిలో కరెంట్ బిల్లులు వసూలు అయినట్టు హర్యానా పవర్ రిటైలర్లు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం ప్రకటించిన పది రోజుల్లో 750 మిలియన్ల(7500లక్షల) బిల్లులను వసూలు చేసినట్టు ఆ ప్రావినెన్స్ విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శ అనురాగ్ రోస్తోగి తెలిపారు. గడువు ముగిసే లోపలే చెల్లించాల్సిన బిల్లులను చెల్లించేందుకు వినియోగదారులు తెగ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
పక్కనే ఉన్న పంజాబ్ రాష్ట్రం కూడా 2,000 లక్షల రూపాయల విద్యుత్ చార్జీలను సేకరించిందని ఆ రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.సీ అరోరా తెలిపారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంతో సంక్షోభంలో ఉన్న పవర్ కంపెనీలు కోలుకుంటున్నాయని, ఇన్నిరోజులు రాని బకాయిలు ఒక్కసారిగా ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసులకు వెల్లువెత్తుతున్నాయని, దీంతో తమ రెవెన్యూలను మెరుగుపరుచుకోవచ్చని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కావాలని ఎగ్గొట్టిన వారు కూడా తీసుకొచ్చి పాత నోట్లతో బిల్లులు చెల్లిస్తున్నట్టు పవర్ రిటైలర్లు చెబుతున్నారు.
నవంబర్ 9 నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ చమురు సంస్థల పరిధిలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసులు, మెడిసిన్ షాపులు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించారు. దీంతో బ్యాంకులు, పెట్రోల్ బంకులు, ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసుల వద్ద పాత నోట్లను మార్చుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నారు.
Advertisement
Advertisement