ఏ హోదా కింద భద్రత కల్పిస్తున్నారు: జశోదాబెన్
అహ్మదాబాద్: తనకు ఏ హోదా కింద భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నారో తెలపాలంటూ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. భద్రతతో పాటు ప్రధాని భార్యకు ప్రోటోకాల్ ప్రకారం ఇంకా ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారని ఆమె అడిగారు.
తాను ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుంటే, తన భద్రతా సిబ్బంది అధికార వాహనాలు వాడుతున్నారని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బాడీగార్డుల చేతిలోనే హత్యకు గురైయ్యారని, తనచుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది కారణంగా భయపడుతున్నానని దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు కేటాయించిన భద్రతా సిబ్బంది వివరాలు ఇవ్వాలని కోరారు.
తన వివాహం గురించి నరేంద్ర మోదీ తొలిసారిగా ఈ ఏడాది ఏప్రిల్ లో అధికారికంగా వెల్లడిచేశారు. వడోదర నుంచి నామినేషన్ వేసినప్పుడు తన భార్య పేరు జశోదాబెన్ అని దరఖాస్తులో పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత నుంచి జశోదాబెన్ కు 24 గంటలూ భద్రత కల్పిస్తున్నారు.