ముందస్తు విరమణకూ వర్తింపు | PM Narendra Modi launches Delhi Metro's Faridabad corridor | Sakshi
Sakshi News home page

ముందస్తు విరమణకూ వర్తింపు

Published Mon, Sep 7 2015 12:35 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

ముందస్తు విరమణకూ వర్తింపు - Sakshi

ముందస్తు విరమణకూ వర్తింపు

ఓఆర్‌ఓపీపై ప్రధాని మోదీ స్పష్టీకరణ  
* ఎంతో కష్టమైనా.. హామీ మేరకు ఓఆర్‌ఓపీని అమలు చేస్తున్నాం
* 40 ఏళ్లుగా ఏమీ చేయని వారు మమ్మల్ని ప్రశ్నిస్తారా?
* కాంగ్రెస్‌పై ఫరీదాబాద్ సభలో ధ్వజం
ఫరీదాబాద్/న్యూఢిల్లీ: సైనిక బలగాల నుంచి త్వరగా పదవీ విరమణ చేసిన జవాన్లకు కూడా ఒకే ర్యాంకు - ఒకే పెన్షన్ (ఓఆర్‌ఓపీ) వర్తిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓఆర్‌ఓపీ డిమాండ్‌ను అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే.. వీఆర్‌ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) తీసుకున్న వారికి ఇది వర్తించబోదని రక్షణమంత్రి మనోహర్ పారికర్ పేర్కొనటంపై.. మాజీ సైనికోద్యోగులు తీవ్రంగా స్పందించారు. శనివారం రాత్రే రక్షణమంత్రిని కలిసిన మాజీ సైనికోద్యోగులు.. సైనిక బలగాల్లో వీఆర్‌ఎస్ అనేదే లేదన్న తమ వాదనతో మంత్రి ఏకీభవించారని, కాబట్టి నిర్ణీత గడువుకన్నా ముందుగా పదవీ విరమణ చేసిన వారికీ ఓఆర్‌ఓపీ వర్తిస్తుందని అన్నారు.

ఈ నేపథ్యంలో మోదీ ఆదివారం ఈ అంశంపై స్పందించారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో మెట్రో రైలును ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘15-17 ఏళ్ల సర్వీసు అనంతరం ఉద్యోగం నుంచి వైదొలగిన వారికి ఓఆర్‌ఓపీ రాదని కొందరు భావిస్తున్నారు. నా జవాను సోదరులారా.. హవల్దార్ కానీ, సిపాయి కానీ, నాయక్ కానీ.. దేశానికి భద్రత కల్పించేది మీరు. ఎవరికైనా ఓఆర్‌ఓపీ వచ్చేట్లయితే.. ముందు మీరే ఉంటారు’ అని పేర్కొన్నారు.  

‘యుద్ధం చేస్తూ శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయి సైన్యం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిన వారికి ఓఆర్‌ఓపీ నిరాకరించటం జరుగుతుందా? సాయుధ బలగాలను ప్రేమించే ఒక ప్రధాని అలా ఎన్నడూ కనీసం ఆలోచన కూడా చేయలేడు. అటువంటి వారందరికీ ఓఆర్‌ఓపీ వస్తుంది. అందుకే.. రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లలో అత్యధిక మొత్తం 15-17 ఏళ్ల సర్వీసు తర్వాత వెళ్లిపోవాల్సి వచ్చిన అటువంటి జవాన్లకు వెళుతుంది’అని చెప్పారు. సాయుధ బలగాల్లో 80-90 శాతం మంది అటువంటి సైనికులే ఉంటారని పేర్కొన్నారు.
 
ఏమీ చేయని వారు ప్రశ్నిస్తారా?
తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కు లేదని పరోక్షంగా విమర్శిస్తూ.. ఓఆర్‌ఓపీ 42 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని.. ఈ కాలంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా సైనిక బలగాలకు వట్టి మాటలతో సానుభూతి చూపటం మినహా చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తాను గత ఏడాది మే 26వ తేదీన పదవి స్వీకరించానని, ఈ నిర్ణయాన్ని అమలు చేయటం చాలా కష్టంతో కూడుకున్నదని పేర్కొన్నారు.

‘గత ప్రభుత్వం ఓఆర్‌ఓపీకి రూ. 500 కోట్లే కేటాయించింది. మేం అధికారంలోకి వచ్చినపుడు రూ. 600 కోట్లు లేదా రూ. 700 కోట్లు ఉంటుందనుకున్నాం. కానీ..  కూర్చుని లెక్కవేసినపుడు కొత్త విషయాలు ముందుకొచ్చాయి. ప్రభుత్వం, అధికారుల్లో అయోమయం నెలకొంది. గత కొన్ని రోజులుగా నేను లెక్కవేయటం మొదలుపెట్టాను. మొత్తం రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల వరకూ ఉండొచ్చని తెలుసుకున్నాను. ఈ అంశం చాలా కష్టమైనది. దీని ప్రభావం ఎలా ఉంటుందో మున్ముందు ఏఏ అంశాలు తలెత్తుతాయో తెలియదు.

కానీ.. మేం ఒక హామీ ఇచ్చాం.. దానిని అమలు చేస్తున్నాం’ అనివివరించారు. ‘42 ఏళ్ల పాటు ఏమీ చేయని వారు.. వీఆర్‌ఎస్ పేరుతో మిమ్మల్ని (సైనికులను) తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్లు రాజకీయంగా పైచేయి సాధించాలని మాత్రమే అనుకుంటున్నారు’ అని కాంగ్రెస్‌ను విమర్శించారు.

అలాగే.. ప్రతిపాదిత కమిషన్ గురించి ప్రస్తావిస్తూ.. అదేమీ వేతన సంఘం కాదని.. ఓఆర్‌ఓపీ అమలులో చిన్నచిన్న మార్పులు ఏమైనా అవసరమా అనేది పరిశీలించేందుకు మాత్రమేనని.. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, ఓఆర్‌ఓపీ అమలులో ఎదురయ్యే చిన్న చిన్న అంశాలను క్రమంగా పరిష్కరిస్తూ వెళ్తామని రక్షణమంత్రి పారికర్ చెప్పారు. అవసరమైన ఆర్థిక అవసరాలన్నింటినీ పూర్తిగా తీరుస్తామని  అన్నారు. అయితే..నూటికి నూరు శాతం అంతా తృప్తి చెందలేరని పారికర్ తెలిపారు.
 
ఓఆర్‌ఓపీని పలచబార్చారు: ఆంటోని
యూపీఏ తెచ్చిన ఓఆర్‌ఓపీ పథకాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం గణనీయంగా పలచబార్చటంతో పాటు.. దానిపై రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని విమర్శించారు. ఓఆర్‌ఓపీని 2014 ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని యూపీఏ ప్రకటించిందని.. ఆ తేదీతో ప్రకటిస్తే ఆ ఘనత యూపీఏకు వెళుతుందన్న భయంతో జూలై నుంచి అమలు చేసేలా తేదీ మార్చారని ధ్వజమెత్తారు. ఓఆర్‌ఓపీకి ఎన్ని నిధులైనా ఇస్తామని చెప్పామన్నారు.
 
మాజీ సైనికోద్యోగుల ఆమరణ దీక్ష విరమణ
* నాలుగు డిమాండ్లపై ఆందోళన కొనసాగుతుందని వెల్లడి
ఓఆర్‌ఓపీ కోసం గత 85 రోజులుగా ఆందోళన చేస్తున్న మాజీ సైనికోద్యోగులు ప్రధాని ప్రకటన నేపథ్యంలో  నిరవధిక నిరాహారదీక్షను ఆదివారం విరమించారు. ప్రధాని ప్రకటనను స్వాగతిస్తున్నామని.. అయితే మరో నాలుగు అంశాలనూ ప్రభుత్వం అంగీకరించే వరకూ ఆందోళనను కొనసాగిస్తామని రిటైర్డ్ మేజర్ జనరల్ సత్బీర్‌సింగ్ పేర్కొన్నారు.

ఐదేళ్లకోసారి పెన్షన్‌ను సమీక్షిస్తామనటం తమకు అంగీకారం కాదన్నారు. రెండేళ్లకోసారి సమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన జ్యుడీషియల్ కమిషన్‌లో ముగ్గురు మాజీ సైనికోద్యోగులు, ఒక ప్రస్తుత సైనికాధిపతితో పాటు రక్షణశాఖ నుంచి ఒక ప్రతినిధి.. మొత్తం ఐదుగురు సభ్యులు ఉండాలన్నారు. ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వం ప్రకటించినట్లు ఆరు నెలల్లో కాకుండా నెల రోజుల వ్యవధిలోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇక ఓఆర్‌ఓపీ అమలుకు ప్రామాణిక సంవత్సరంగా 2013 క్యాలెండర్ సంవత్సరం కాకుండా.. 2014 మార్చి 31ని నిర్ణయించాలని పట్టుపట్టారు. ప్రభుత్వం క్యాలెండర్ సంవత్సరానికి కట్టుబడి ఉంటే.. డిసెంబర్ 31ని నిర్ణయించాలన్నారు. పెండింగ్ అంశాలను సత్వరం పరిష్కరించాలని ఈ నెల 12న ఢిల్లీలో భారీ స్థాయిలో ‘గౌరవ్ ర్యాలీ’ నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్లయితే తిరిగి ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని స్పష్టంచేశారు. గురుద్వారా నుంచి తెచ్చిన ప్రసాదంతో మాజీసైనికోద్యోగుల ఐక్యవేదిక సభ్యులు నిరశనదీక్ష విరమించారు.
 
మెట్రో రైల్లో మోదీ
* ఫరీదాబాద్ మెట్రో ప్రారంభం
ఫరీదాబాద్: ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న బదర్‌పూర్-ఫరీదాబాద్ మెట్రో రైలు కారిడార్‌ను ప్రధాని మోదీ ఆదివారం ఫరీదాబాద్‌లో ప్రారంభించారు. ఈ మార్గం దేశ రాజధాని ఢిల్లీని హరియాణాలోని ఫరీదాబాద్‌తో కలుపుతుంది. మెట్రో ప్రారంభం కోసం ప్రధాని ఢిల్లీలోని జనపథ్ స్టేషన్ నుంచి మెట్రో వెలైట్ లైన్ రైల్లో ఫరీదాబాద్‌లోని బాటా స్టేషన్‌కు చేరుకున్నారు. షెడ్యూలు ప్రకారం హెలికాప్టర్‌లో వెళ్లాల్సిన ప్రధాని రైల్లో ప్రయాణించడంతో ప్రయాణికులు, అధికారులు ఆశ్చర్యపోయారు.

మోదీ ప్రయాణికులతో ముచ్చటించారు. వారి కోరికపై సెల్ఫీ ఫొటోలు కూడా దిగారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, వీరేందర్ సింగ్, రావ్ ఇందర్‌జిత్ సింగ్, ఢిల్లీ మెట్రో చీఫ్ మంగు సింగ్ ప్రయాణించారు. మెట్రో ప్రారంభం తర్వాత నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ కొత్త కారిడార్ వల్ల  కీలక పారిశ్రామిక ప్రాంతమైన ఫరీదాబాద్‌లో ఢిల్లీ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అన్నారు. మెట్రో కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదని, ఆర్థిక ప్రగతికి కూడా అవకాశం కల్పిస్తుందని అన్నారు.

14 కిలోమీటర్ల బదర్‌పూర్-ఫరీదాబాద్ కారిడార్‌ను రూ. 2,500 కోట్లతో నిర్మించారని, దీన్ని బల్లభ్‌గఢ్‌కు పొడిగించేందుకు మరో రూ. 400 కోట్లు ఖర్చు పెట్టనున్నామని తెలిపారు. సభలో వెంకయ్య మాట్లాడుతూ ఈ కారిడార్ నిర్మాణంతో ఢిల్లీ మెట్రోలో 200 కి.మీ పూర్తయిందని తెలిపారు. 9 స్టేషన్ల గుండా వె ళ్లే ఈ మార్గం దాదాపు ఫరీదాబాద్‌లోని అన్ని ప్రాంతాల మీదుగా వెళ్తుంది. ఈ మార్గంలో రోజూ 2 లక్షల మంది ప్రయాణిస్తారని అధికారుల అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement