బెంగళూరు: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మెడికో విద్యార్థి కామేశ్వర సాయి ప్రసాద్ మృతికి సంబంధించి కీలక నోట్ తమకు లభించినట్లు ఐజీ అమర్‌కుమార్ పాండే తెలిపారు. నోట్ కామేష్ రాశారా? మరెవరైనా అన్నది విచారణ చేస్తున్నామని ఆయన మీడియాకు తెలిపారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డవారే కామేష్‌ను చంపేశారన్న దానిపై కూడా ఇంకా ఆధారాలు లభించలేదన్నారు. ఈ నెల 12న సాయి ప్రసాద్పై దుండగులు పెట్రోలు పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే.
మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న కామేష్ అదే రోజు రాత్రి సమయంలో దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండుగులు అతడి మెడలో గొలుసును లాగడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో 70 శాతం గాయపడిన అతను బెంగళూరులోని సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో అప్పటి నుంచి మృత్యువుతో పోరాడి అసువులు బాసాడు.