Kameswara sai prasad
-
'మృతి చెందిన కామేష్ గదిలో ఓ కీలకమైన నోట్ దొరికింది'
బెంగళూరు: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మెడికో విద్యార్థి కామేశ్వర సాయి ప్రసాద్ మృతికి సంబంధించి కీలక నోట్ తమకు లభించినట్లు ఐజీ అమర్‌కుమార్ పాండే తెలిపారు. నోట్ కామేష్ రాశారా? మరెవరైనా అన్నది విచారణ చేస్తున్నామని ఆయన మీడియాకు తెలిపారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డవారే కామేష్‌ను చంపేశారన్న దానిపై కూడా ఇంకా ఆధారాలు లభించలేదన్నారు. ఈ నెల 12న సాయి ప్రసాద్‌పై దుండగులు పెట్రోలు పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న కామేష్ అదే రోజు రాత్రి సమయంలో దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండుగులు అతడి మెడలో గొలుసును లాగడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో 70 శాతం గాయపడిన అతను బెంగళూరులోని సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో అప్పటి నుంచి మృత్యువుతో పోరాడి అసువులు బాసాడు. -
వైద్య విద్యార్థి కామేష్ మృతి
-
వైద్య విద్యార్థి సాయి ప్రసాద్ మృతి
బెంగళూరు : కోలార్‌లో దుండగులు పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో విద్యార్థి కామేశ్వర సాయి ప్రసాద్ మంగళవారం మృతి చెందాడు. ఈ నెల 12న సాయి ప్రసాద్‌పై దుండగులు పెట్రోలు పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 70 శాతం గాయపడిన అతను బెంగళూరులోని సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతున్నాడు. అయితే గాయాలు తీవ్రంగా ఉండటంతో పాటు, మూత్రపిండాలు పనిచేయకపోవడంతో వైద్యులు డయాలసిస్ నిర్వహించారు. కృత్రిమ శ్వాసను కొనసాగించినా... పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కామేశ్వర సాయిప్రసాద్ (22) మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈనెల 12వతేదీ రాత్రి 10.30 సమయంలో దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండుగులు అతడి మెడలో గొలుసును లాగడానికి ప్రయత్నించారు. కామేశ్వర్ ప్రతిఘటించడంతో దుండగులు అతనిపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యారు. స్థానికులు వెంటనే మంటలు ఆర్పి, దగ్గరలోని జాలప్ప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కామేశ్వర్‌ను బెంగుళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన బాధితుడి తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణశర్మ న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. లక్ష్మణ శర్మ కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగా, జ్యోతి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతూ హైదరాబాద్ లోని మారేడ్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. కామేశ్వర సాయి ప్రసాద్ మృతి మారేడ్‌పల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. -
సాయి ప్రసాద్ పరిస్థితి విషమం
కోలారు(కర్ణాటక), న్యూస్‌లైన్: దుండగులు పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థి కామేశ్వర సాయి ప్రసాద్ (22) పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు గురువారం తెలిపారు. అతని శరీరంలో కొన్ని అవయవాలు స్తంభించిపోయాయని, మరో రెండు, మూడు రోజులు గడిస్తే కానీ ఏ విషయమూ చెప్పలేమని వారు చెప్పారు. అతన్ని బతికించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సాయి ప్రసాద్ కోలారు సమీపంలోని దేవరాజ్ అర్స్ వైద్య కళాశాలలో మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న సంగతి తెలిసిందే. గత మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా దేవరాజ్ అర్స్ వైద్య కళాశాల సమీపంలో.. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతని మెడలోని గొలుసును లాక్కుపోయే ప్రయత్నంలో ఈ దురాగతానికి పాల్పడడం విదితమే. ఈ సంఘటనను దారిదోపిడీ సందర్భంగా జరిగినదిగా సాయి ప్రసాద్ సహచరులు పేర్కొన్నారు. ఆరు నెలలుగా ఏదో మార్పు: దేవరాజ్ అర్స్ వైద్య కళాశాలలో మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న సాయి ప్రసాద్ గత ఆరేడు నెలలుగా తరగతులకు సక్రమంగా హాజరు కావట్లేదని తెలిసింది. అతను మంచివాడని, ఎవరితోనూ గొడవ పడేవాడు కాదని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాణికొప్ప తెలిపారు. మూడేళ్లుగా ఫస్ట్‌క్లాస్‌లోనే పాసవుతూ వస్తున్నాడని చెప్పారు. అయితే ఎందుకనో... ఫైనలియర్ తరగతులకు సక్రమంగా హాజరు కావట్లేదన్నారు. నెల రోజుల నుంచి క్యాంపస్‌లో కూడా కనిపించడం లేదని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రఘునాథ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ రామ్నివాస్ చెప్పారు.